న్యూఢిల్లీ: బీహార్ లోని ముజఫర్ పూర్ షెల్టర్ అత్యాచారాల కేసులో షెల్టర్ నిర్వాహకుడు బ్రజేష్ ఠాకూర్ ను, మరో 18 మందిని ఢిల్లీ కోర్టు దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు చెప్పింది. ముజఫర్ పూర్ లోని షెల్టర్ లో పలువురు బాలికలపై అత్యాచారాలు చేసినట్లు, వారిని శారీరకంగా చిత్రహింసల పాలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. 

బ్రజేష్ కుమార్ ను మరో 18 మందిని కోర్టు దోషులుగా తేల్చింది. వారిలో ఎనిమిది మంది మహిళలు, 12 మంది పురుషులు ఉన్నారు. వారిలో పీపుల్స్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. పలు ఇతర అభియోగాల్లో కూడా వారు దోషులుగా తేలారు. 

ఆ 19 మంది దోషులకు జనవరి 28వ తేదీ ఉదయం శిక్,లను ఖరారు చేస్తారు. వారికి జీవిత ఖైదు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ముజఫర్ పూర్ షెల్టర్ ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అసభ్యకరమైన పాటలకు అమ్మాయిలతో నృత్యాలు చేయించడం, బాలికలకు మత్తు మందు ఇచ్చి వారిపై అత్యాచారాలు చేయడం వంటి దారుణమైన సంఘటనలు జరిగాయి. 

ఆ కుంభకోణంలో రాజకీయ నాయకులు, అధికారులు కూడా పాలు పంచుకున్నట్లు తేలింది. ఈ కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో పాలక జనతాదళ్ యునైటెడ్ సభ్యురాలు మంజు వర్మ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆమె భర్తతో బ్రజేష్ ఠాకూర్ కు ఉన్న సంబంధాలు కూడా వెలుగు చూశాయి.