Asianet News TeluguAsianet News Telugu

Bihar Politics: నితీష్ కుమార్ బ‌లప‌రీక్ష ఆనాడే.. ! మ‌రీ మహాఘట్‌బంధన్ అధికారం నిల‌బెట్టుకునేనా?

Bihar Politics: బీహార్‌లో నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌ ప్రభుత్వం ఈ నెల 24న రాష్ట్ర అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవడానికి  విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నది. సీఎంగా నితీశ్‌ కుమార్‌, డిప్యూటీ సీఎంగా ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌ బుధవారం ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.

Bihar Politics Nitish Kumar to face floor test on Aug 24
Author
Hyderabad, First Published Aug 12, 2022, 5:26 AM IST

Bihar Politics: బీహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాఘటబంధన్ ప్రభుత్వం ఈ నెల 24న బ‌ల‌ప‌రీక్ష‌ను ఎదుర్కోనున్న‌ది. బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌తో తెగ‌దెంపులు చేసుకుని..సీఎంగా రాజీనామా చేసిన నితీష్ కుమార్.. అనంత‌రం ఆర్జేడీ  నేతృత్వంలోని మహాఘటబంధన్ తో జ‌త‌క‌ట్టాడు. తిరిగి బుధవారం రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ తరుణంలో ఉప ముఖ్యమంత్రిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. 

బుధవారం నాడు కుమార్, యాదవ్‌లు హాజరైన మంత్రివర్గ సమావేశంలో ఆగస్టు 24న ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాల‌ని నిర్ణ‌యించారు. రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరిచేందుకు తగిన సిఫారసు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్‌గా  ఉన్న బీజేపీకి చెందిన విజయ్‌కుమార్‌ సిన్హా తొల‌గించాల‌ని మహాకూటమి నిర్ణయించింది. ఈ క్ర‌మంలో ఆగస్టు 16న మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని, జనతాదళ్-యునైటెడ్ కంటే ఆర్జేడీకే ఎక్కువ మంది మంత్రులు ఉంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. 242 మంది ఎమ్మెల్యేలున్న బీహార్‌ అసెంబ్లీలో మహాఘటబంధన్ లేదా మహాకూటమికి 164 మంది సభ్యుల మద్దతు ఉంది.

మహాఘటబంధన్‌లో కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో సహా ఆర్‌జెడి, ఇతర పార్టీలతో చేతులు కలిపే ముందు నితీష్ కుమార్ మంగళవారం ఎనిమిదేళ్లలో రెండవసారి బిజెపితో తన పొత్తును విచ్ఛిన్నం చేశారు. అసెంబ్లీలో నలుగురు ఎమ్మెల్యేలున్న హెచ్‌ఏఎం మద్దతు కూడా మహాకూటమికి ఉంది. బీహార్ ప్రజలు ఇచ్చిన ఆదేశాన్ని నితీష్ కుమార్ అగౌరవపరిచారని బీజేపీ ఆరోపించింది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేశాయి. బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ నితీష్‌ కుమార్‌ ముఖ్యమంత్రిని చేశారు. కేబినెట్‌లో కాంగ్రెస్‌కు 2-3 మంది ప్రతినిధులు ఉండే అవకాశం ఉందని, హెచ్‌ఏఎంకు ఒక బెర్త్ లభించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios