బిహార్‌లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీతో జేడీయూ తెగదెంపులు చేసుకున్నది. ఎన్‌డీయే కూటమి నుంచి జేడీయూ మరోసారి బయటకు వచ్చేసింది. సాయంత్రం 4 గంటలకు ఆయన ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌తో కలిసి గవర్నర్ ఫగు చౌహాన్‌ను కలుబోతున్నట్టు సమాచారం.
పాట్నా: బిహార్ రాజకీయంగా ఒక్కసారిగా వేడెక్కింది. నిన్నటి నుంచి బిహార్ రాజకీయంలో అనూహ్య వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా, అధికారంలోని బీజేపీ, జేడీయూల మధ్య దోస్తీ చివరిదాకా సాగేనా? అనే అనుమానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో నితీష్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఇందులో బీజేపీకి కటీఫ్ చెప్పడానికి అందరూ ఏకగ్రీవంగా అంగీకరించినట్టు తెలిసింది. అధికార కూటమిని జేడీయూ బ్రేక్ చేసింది. బీజేపీతో కూటమి నుంచి బయటకు వచ్చింది. జేడీయూకు వ్యతిరేకంగా బీజేపీ కుట్రలు చేసిందని, తమను ఎప్పుడూ గౌరవించలేదని నితీష్ కుమార్ ఆ సమావేశంలో పేర్కొన్నట్టు తెలిసింది.
నితీష్ కుమార్.. బీజేపీ నుంచి తెగదెంపులు చేసుకోవడమే కాదు.. ప్రతిపక్షాలతో ఆల్రెడీ అన్ని విషయాలు దాదాపు మాట్లాడుకున్నారని తెలుస్తున్నది. ఇందులో భాగంగానే ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్‌తోపాటు నితీష్ కుమార్ బిహార్ గవర్నర్ ఫగు చౌహాన్‌ను కలువబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వీరిద్దరూ గవర్నర్‌ను కలువనున్నారు.
అంతేకాదు, కొత్త కూటమిలోనూ ఈక్వేషన్లు సరి చూసుకున్నట్టు పార్టీల విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతున్నది. సీఎంగా నితీష్ కుమార్ కొనసాగుతాడని, హోం శాఖ పోర్ట్ ఫోలియోను ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు అందించడానికి అంగీకారం కుదిరినట్టు సమాచారం. 2024 వరకు సీఎంగా నితీష్ కుమార్ కొనసాగుతారని తెలిసింది. 2025లోపే అధికార మార్పు ఉంటుందని, ఆర్జేడీకి పగ్గాలు అందుతాయని సమాచారం వచ్చింది. ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ కూటమి తేజస్వీ యాదవ్ నేతృత్వంలో పోటీ చేయనున్నట్టు తెలిసింది.
కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు తమ మద్దతు తెలుపుతూ లేఖను తేజస్వీ యాదవ్‌కు అందించారు. తేజస్వీ యాదవ్ కూడా తమ మొత్తం మద్దతును తెలియజేస్తూ నితీష్ కుమార్‌కు లేఖ అందించినట్టు తెలిసింది. తేజస్వీ యాదవ్‌తో కలిసి గవర్నర్‌ను కలవడానికి సాయంత్రం 4 గంటలకు సీఎం నితీష్ కుమార్ అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు వీరంతా మరో సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆ తర్వాతే స్పష్టమైన వివరాలు బయటకు రానున్నాయి.
రాజ్యసభకు జేడీయూ నేత ఆర్సీపీని మళ్లీ నామినేట్ చేయకపోవడం నుంచే అటు బీజేపీ, ఇటు జేడీయూల మధ్య సందేహాత్మక వాతావరణం ఏర్పడింది. మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండేను తమ కంట్రోల్‌లోకి తెచ్చుకుని ఉద్ధవ్ ఠాక్రేనే సీఎం సీటు నుంచి బీజేపీ ఇంటికి పంపించిన ఎపిసోడ్ నితీష్ కుమార్‌ను కలవరపెట్టింది. బిహార్‌లోనూ ఆర్సీపీ సింగ్ మరో ఏక్‌నాథ్ షిండ్ తనకే మేకు అయ్యేలా ఉన్నాడని నితీష్ భావించారు.
