Bihar: బీహార్‌లోని నలంద జిల్లాలో బుధవారం గ్రామీణాభివృద్ధి మంత్రి శ్రవణ్ కుమార్, హిల్సా ఎమ్మెల్యే కృష్ణ మురారి (ప్రేమ్ ముఖియా) పై గ్రామస్తులు దాడి చేశారు. వారు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి దాదాపు 1 కిలోమీటరు పరిగెత్తారు.
Bihar minister attack: ప్రజాప్రతినిధులకు ఇదో హెచ్చరిక. ఓటర్లు తమ నాయకులకు ఓట్లు వేయడమే కాదు, అవసరమైతే తాట కూడా తీస్తారనే సంకేతం. ఓటరు ఆశ, కోపం, నాయకుల భయం అన్ని కలసి భయానక వాతావరణాన్ని సృష్టించాయి. నమ్మిన నేతలే అన్యాయం చేస్తుంటే.. ఆ గ్రామస్థులు ఊరుకోలేకపోయారు. తమను చిన్నచూపు చూస్తే.. కన్నేర్ర చేశారు. తమ సమస్యను పట్టించుకోవడం లేదని కార్చిచ్చులా ఎగసిపడ్డారు. మంత్రి, ఎమ్మెల్యేపై కర్రలతో, రాళ్లతో దాడికి దిగారు. ఓటు వేసి ఎన్నుకున్న నాయకులను 1 కి.మీ.కు పైగా తరిమికొట్టారు. ప్రస్తుతం ఈ ఘటన రాజకీయంగా చర్చనీయంగా మారింది. ఇంతకీ ప్రతిఘటన ఎక్కడ జరిగింది? ఇంతకీ ఏం జరిగిందంటే?
దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారిన ఈ ఘటన బీహార్ సీఎం నితీష్ కుమార్ నియోజకవర్గం నలందలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. నలందలోని మతంపుర్సి గ్రామంలో రెండు రోజుల క్రితం జరిగిన ఓ రోడ్డు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సీఎం నియోజకవర్గంలో ఘటన జరిగిన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన, అధికారుల సంప్రదింపులు లేవు. ఈ నేపథ్యంలో ఆలస్యంగా బాధిత కుటుంబాలను కలవడానికి బుధవారం గ్రామీణాభివృద్ధి మంత్రి శ్రవణ్ కుమార్, హిల్సా ఎమ్మెల్యే కృష్ణ మురారి (ప్రేమ్ ముఖియా)లు ఆ గ్రామంలో పర్యటించారు.
బాధిత కుటుంబంతో మంత్రి, ఎమ్మెల్యే లు దాదాపు అరగంట పాటు మాట్లాడి, పరామర్శించారు. ఇక పర్యటన ముగిసిందిలే అనుకునే లోపు ఓ నిరసన సెగ ఎగిసిపడింది. అధికారులు సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్లనే అనేకమంది ప్రాణాలు కోల్పోయినట్లు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తారు. ఈ క్రమంలో నాయకులకు, ప్రజలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ చిన్న గొడవ కాస్తా ఘర్షణకు దారి తీసింది.
ఈ క్రమంలో ఆగ్రహించిన గ్రామస్తులు కర్రలతో నేతలపై దాడికి దిగారు. గ్రామస్థులంతా ఏకం కావడంతో పోలీసుల పరిస్థితి చేయి దాటింది. దీంతో మంత్రి, ఎమ్మెల్యే తమ ప్రాణాలను కాపాడుకోవడానికి దాదాపు 1 కిలోమీటరు పరిగెత్తారు. దాడిలో వారి బాడీగార్డులు, స్థానిక నేతలు తీవ్రంగా గాయపడ్డారు. వాస్తవానికి నలందలోనే జరిగిన ఘర్షణకు ప్రధాన కారణం.. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో పెద్ద ప్రమాదం జరిగినా.. 9 మంది చనిపోయినా ఏ ప్రభుత్వ ప్రతినిధి లేదా మంత్రి గాని వచ్చి, పరిస్థితిని పరిశీలించలేదు. కనీసం నష్టపరిహారం ప్రకటించలేదు.
దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్యం కారణంగా సంఘటన మరింత ఉధృతమైంది. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించబడ్డారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది.
