బీహార్‌లో దారుణం జరిగింది. తన కొడుకు ఎంతకు ఏడుపు ఆపకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లి చిన్నారి పెదాలను ఫెవీక్విక్‌తో అంటించేసింది. వివరాల్లోకి వెళితే.. చాహాప్రాకు చెందిన శోభ తన కొడుకు ఏడుస్తుండటంతో అతనిని సముదాయించేందుకు ప్రయత్నించింది.

అయితే చిన్నారి ఎంతకు ఏడుపు ఆపకపోవడంతో ఆమెకు సహనం నశించింది. దీంతో కొడుకు నోరు మూయిస్తే కానీ వాడు ఏడుపు ఆపడని భావించింది. అంతే ఫెవీక్విక్‌తో అతని పెదాలకు రాసింది.

అప్పుడే బయట నుంచి ఇంట్లోకి వచ్చిన పిల్లాడి తండ్రికి బాబు ఏడుపు వినిపించకపోవడంతో అనుమానం వచ్చింది. బాబు దగ్గరికి వెళ్లి చూడగా అతని నోటి నుంచి నురుగు వస్తోంది. తీవ్ర ఆందోళనకు గురైన అతను భార్య శోభను పిలిచి ఏం జరిగిందని అడిగాడు.

ఎంతకు ఏడుపు ఆపకపోవడంతో కొడుకు నోరు మూయించేందుకు ఫెవిక్విక్ రాసినట్లు భార్య చెప్పడంతో అతను నిర్ఘాంతపోయాడు.  హుటాహుటిన కొడుకును తీసుకుని ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు చిన్నారి పెదాలకు అంటిన గమ్‌ను తొలగించడంతో అతను ఊపిరి పీల్చుకున్నాడు.