బిహార్‌లో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్ పెళ్లికి వెళ్లాడు. పెళ్లి పీటలపైకి వెళ్లి ఆమె మెడలో వరమాల వేశాడు. నుదుట సింధూరం పెట్టాడు. దీంతో అక్కడి వారు ఆ వ్యక్తిని చితగ్గొట్టారు. చివరకు వధువు, వరుడు కుటుంబాల మధ్య వైరం పెరిగింది. కేసులు పెట్టుకున్నాయి. 

పాట్నా: బిహార్‌లో ఊహించని ఘటన జరిగింది. నలందకు చెందిన యువతీ, యువకుడు ఏడాది కాలంగా ప్రేమించుకున్నారు. ఈ విషయం అమ్మాయి కుటుంబానికి తెలిసింది. వెంటనే అమ్మాయికి పెళ్లి సంబంధం చూసి మరో యువకుడితో పెళ్లి చేయడానికి ఫిక్స్ అయ్యారు. పెళ్లి రోజు కూడా వచ్చేసింది. కానీ, ఆ అమ్మాయి మాత్రం తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లికి రావాలని కోరింది. సరిగ్గా ముహూర్తానికి తన మెడలో వరమాల వేయాలని, ఆ తర్వాత నుదుటిపై బొట్టు పెట్టాలని చెప్పింది. బాయ్‌ఫ్రెండ్ ఆమె చెప్పినట్టే తూచ తప్పకుండా చేశాడు. ఈ ఘటనను చూసి నివ్వెరపోయారు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత ఆ యువకుడిపై పిడిగుద్దులు కురిపించారు. ఆ యువకుడు చివరకు తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

బిహార్‌లోని నలంద జిల్లాలో ముబారక్‌పూర్ గ్రామం ఉన్నది. ముబారక్‌పూర్‌కు చెందిన ముకేశ్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. వారిద్దరూ ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. కలిసే జీవించాలనుకున్నారు.. కలిసే చావాలనుకున్నారు. కానీ, వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన అమ్మాయి కుటుంబం ఇక ఆలస్యం చేయాలనుకోలేదు. వెంటనే ఓ సంబంధం చూసి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసేశారు. 

ఇవన్నీ ఒక వైపు జరుగుతుండగా ఆ యువతి మాత్రం తన బాయ్‌ఫ్రెండ్‌తో ఫోన్‌లో కాంటాక్ట్‌లోనే ఉన్నది. పెళ్లి గురించిన వివరాలన్నీ ఎప్పటికప్పుడు అతనికి చెబుతూ వచ్చింది. తన పెళ్లికి రావాలని, పెళ్లి పీటలపై కూర్చున్న తన మెడలో పూలమాల వేయాలని, తానే తన నుదుటిపై సింధూరం పెట్టాలని సూచించింది. వీరిద్దరూ ముందు నుంచి అనుకున్న ప్లాన్ ప్రకారమే.. పెళ్లికి ఆ అమ్మాయి బాయ్‌ఫ్రెండ్ అటెండ్ అయ్యాడు. తీరా సమయానికి పెళ్లి పీటలపైకి ఎక్కి వరమాల వేశాడు. సింధూరం పెట్టాడు. 

దీంతో అక్కడున్నవారంతా ఆ అబ్బాయిని చితకబాదారు. అమ్మాయే తనను పెళ్లికి రమ్మందని చెప్పడంతో అది పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కుటుంబాల మధ్య గొడవకు దారి తీసింది.

ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వరుడు అంగీకరించలేదు. ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నాయి. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, తీవ్రంగా గాయపడ్డ ముకేశ్ హాస్పిటల్ పాలయ్యాడు. తమ ప్రేమ వ్యవహారం గురించి ముకేశ్ పోలీసులకు చెప్పాడు.