జూదంలో భార్యను ఫణంగా పెట్టి మహాభారతయుద్ధానికి నాంది పలికాడు ఆ ధర్మరాజు. కలియుగంలో అలాంటి కథే పునరావృతం అయ్యింది. అయితే ఆయన ఒక్కసారి పెడితేనే అల్లకల్లోలం అయిపోయింది. పట్నాకు చెందిన సోనూ పదే పదే భార్యను ఫణంగా పెట్టినా యుద్ధం కాదు కదా.. ఏమీ జరగలేదు.. పైగా దానికి ఒప్పుకోనందుకు భార్య యాసిడ్ దాడికి గురి కావాల్సి వచ్చింది. 

వివరాల్లోకి వెడితే బీహార్ లోని పట్నాలో ఓ పేకాటరాయుడు ఓడిన ప్రతి సందర్భంలోనూ శృంగారం కోసం భార్యను గెలిచిన వాళ్లు చేతుల్లో పెట్టేవాడు. రెండు మూడు సార్లు వారితో వెళ్లిన భార్య, ఓసారి నిరాకరించిందనే ఆగ్రహంతో ఆమెపై యాసిడ్‌ పోశాడు. 

బిహార్‌లోని భగల్‌పూర్‌ జిల్లాలో ఈ ఘోరం వెలుగుచూసింది. ధర్మపత్ని పట్ల ఈ ఘోరానికి పాల్పడిన నిందితుడు సోనూ హరిజన్‌. ఇటీవల కొందరితో ఆడిన జూదంలో ఓడిపోయిన సోనూ.. వారితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఓ నెలపాటు వారితోనే ఉండాలంటూ భార్యపై ఒత్తిడి చేశాడు. 

అప్పటికే బయటి వ్యక్తుల చేతుల్లో నరకం చూసిన ఆమె, వెళ్లేందుకు ససేమిరా అనడంతో యాసిడ్‌ పోశాడు. తర్వాత ఆమెను బంధించి ఉంచాడు. బాధితురాలు(30) నెలకుపైగానే గదిలో బందీగా గడిపింది. ఆదివారం తప్పించుకొని పోలీసు స్టేసన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.