Tirupur: వలస కార్మికులపై దాడికి సంబంధించిన ఫేక్ వీడియో షేర్ చేసిన బీహార్ వ్యక్తి అరెస్టు అయ్యారు. ఉత్తర భారత వలస కార్మికులపై దాడి చేసినట్లుగా ఫేస్ బుక్ లో వీడియోలు పోస్ట్ చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు తిరుపూర్ సైబర్ క్రైమ్ ప్రత్యేక బృందం వర్గాలు తెలిపాయి.
Coimbatore: తిరుపూర్ లో వలస కార్మికులపై దాడుల గురించి తన సోషల్ మీడియా పేజీలో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసి, వదంతులు వ్యాపింపజేసినందుకు బీహార్ కు చెందిన 32 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకెళ్తే.. ఇటీవల తమిళనాడు సహా పలు దక్షిణాది ప్రాంతాల్లో వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై బీహార్ సర్కారుతో పాటు తమిళనాడు ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తూ.. దీనిపై చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. అయితే, ఈ దాడులు ఫేక్ గా గుర్తించారు. ఈ క్రమంలోనే పలువురుని అదుపులోకి తీసుకున్నారు. తాజగా వలస కార్మికులపై దాడులకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని పంచుకుంటున్న పోస్టులు షేర్ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు.
తిరుపూర్ సైబర్ క్రైమ్ కు చెందిన ప్రత్యేక బృందం తమ నిఘాను కొనసాగించింది. ఈ క్రమంలోనే జార్ఖండ్ లోని లతేహర్ జిల్లా హెనెగరే గ్రామంలో స్థిరపడిన బీహార్ కు చెందిన నిందితుడు ప్రశాంత్ కుమార్ ఉత్తర భారత వలస కార్మికులపై దాడి చేసినట్లు ఫేస్ బుక్ లో వీడియోలను పోస్ట్ చేసినట్లు గుర్తించింది. అక్కడ మకాం వేసిన బృందం మార్చి 11న ప్రశాంత్ కుమార్ ను అరెస్టు చేసి లతేహర్ జిల్లా కోర్టులో హాజరుపరిచింది. ట్రాన్సిట్ వారెంట్ పై నిందితుడిని తిరుపూర్ కు తీసుకువచ్చి 3వ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి ఆదివారం రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
వదంతులు వ్యాపింపజేసిన బీహార్ కు చెందిన యువకుడిని తిరుపూర్ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. తమిళనాడు పోలీసులు ఇప్పటికే 11 కేసులు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. వలస కార్మికులంతా సురక్షితంగా ఉన్నారనీ, వదంతులు వ్యాపింపజేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు హామీ ఇచ్చారు. బీహార్ వలస కార్మికులపై దాడులకు సంబంధించిన వార్తాలు వైరల్ కావడంతో బీహార్ కు చెందిన ప్రత్యేక అధికారులు బృందం సైతం తమిళనాడులో పర్యటించింది. స్టాలిన్ ప్రభుత్వంతోనూ ఈ అంశం గురించి చర్చలు జరిపింది.
