BJP national president JP Nadda: విద్యార్థుల మనోవేదనలను పరిష్కరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, వారి ఇతర డిమాండ్లను కూడా పరిశీలిస్తానని భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా చెప్పారు. 

All India Students Association (AISA): భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాకు నిర‌స‌న సెగ త‌గిలింది. బీహార్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆయ‌న ఈ చేదు అనుభ‌వం ఎదురైంది. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఎఐఎస్ఏ) కార్యకర్తలు కొందరు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నూతన విద్యా విధానాన్ని (ఎన్ఈపీ) ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (Jagat Prakash Nadda) శనివారం తన విద్యాలయం పాట్నా కళాశాలలో కొద్దిసేపు ఆగిపోవడంతో కోపోద్రిక్తులైన విద్యార్థి కార్యకర్తలు నిరసనలు తెలిపారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA)కి చెందిన కొందరు కార్యకర్తలు "జేపీ నడ్డా గో బ్యాక్" అంటూ నినాదాలు చేశారు. పాట్నా యూనివర్సిటీకి కేంద్ర హోదా కల్పించడమే కాకుండా నూతన విద్యా విధానాన్ని (NEP) ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలోనే నిర‌స‌న‌కారులు ఆయ‌న‌కు కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు జేపీ న‌డ్డాకు వ్య‌తిరేకంగా నిన‌దిస్తూ.. నల్ల జెండాను కూడా ప్ర‌ద‌ర్శించారు.

నివేదికల ప్రకారం.. కళాశాలలో ఈ నిరసన సందర్భంగా AISA.. భార‌తీయ జ‌న‌తా పార్టీ (BJP) మద్దతుగల ABVP మద్దతుదారుల మ‌ధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప‌రిస్థితులు మ‌రింతగా క్షీణించ‌కుండా ఇరువ‌ర్గాల‌ను చెద‌ర‌గొట్ట‌డానికి ప్ర‌య‌త్నించారు. వారు విన‌క‌పోవ‌డంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జిని ఆశ్రయించవలసి వచ్చింది. ప‌రిస్థితులు కొద్దిగా స‌ద్దుమ‌నిగిన త‌ర్వాత జేపీ న‌డ్డా మాట్లాడుతూ.. తాను నిర‌స‌న చేస్తున్న విద్యార్థుల‌ను కలవాలనుకుంటున్నట్లు చెప్పారు. విద్యార్థుల మనోవేదనలను పరిష్కరించడానికి తాను సిద్ధంగా ఉన్నాననీ, వారి ఇతర డిమాండ్లను కూడా పరిశీలిస్తానని చెప్పారు. 

కళాశాలలో ఆడిటోరియం మినహా బహుళ అంతస్తుల భవనం నిర్మించాలని, కాన్వొకేషన్‌ నిర్వహణకు ఇబ్బందిగా ఉందని ఏఐఎస్‌ఏ ఇతర డిమాండ్‌లలో పేర్కొంది. న‌డ్డా ప్రసంగం కొన‌సాగుతున్న స‌మ‌యంలోనూ విద్యార్థులు త‌మ నిర‌స‌న‌ను తెలిపారు. ఆయ‌న ప్ర‌సంగం ముగిసిన త‌ర్వాత పోలీసు సిబ్బంది నిర‌స‌న తెలుపుతున్న విద్యార్థి కార్యకర్తలను తోసేస్తూ దారి క్లియర్ చేయడంతో నడ్డా కళాశాల క్యాంపస్ నుండి సురక్షితంగా బయటపడ్డారు. అయితే, ఈ నిర‌స‌న‌ల‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రినీ అరెస్టు చేయ‌లేద‌ని స‌మాచారం. 

కాగా, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన జెపి నడ్డా (Jagat Prakash Nadda).. తన ప్రారంభ సంవత్సరాలను పాట్నాలో గడిపారు. ఆదివారం ముగియనున్న బీజేపీ ఏడు విభాగాల (మోర్చాల) రెండు రోజుల సమావేశాన్ని ప్రారంభించేందుకు నగరానికి వచ్చారు. అంత‌కుముందు రోజు బీహార్ రాజధానిలో రోడ్ షో నిర్వహించారు.

Scroll to load tweet…

శనివారం జై ప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న నడ్డాను ఉప ముఖ్యమంత్రులు తార్కిషోర్ ప్రసాద్, రేణుదేవి, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్, బీహార్ బీజేపీ చీఫ్ సంజయ్ జైస్వాల్, రాష్ట్ర కేబినెట్ మంత్రులు స్వాగతం పలికారు.