హోరాహోరీగా సాగిన బిఓహార్ ఎన్నికలు ఇందాక ముగిసిన  మూడవ దశ వోటింగ్ తో ముగిసాయి. ఎన్నికలు ముగియగానే, వెనువెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలను పలు  సర్వే సంస్థలు విడుదల చేస్తూ విజేతలను ఊహించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం కూడా చూద్దాము. 

టైమ్స్ నౌ సి ఓటర్ సర్వే:

ఎన్డీయే కూటమి(బీజేపీ+జేడీయూ +వీఐపీ +హెచ్ఏఎం ) 116

యూపీఏ (కాంగ్రెస్+ఆర్జేడీ + లెఫ్ట్) 120

ఎల్జేపీ:  1

ఇతరులు: 6

బీహార్ ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. అధికారంలో ఉన్న నితీష్ కుమార్  జేడీయూ - బీజేపీల కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కుంటుండగా.... ఆర్జేడీ పార్టీ తన అస్థిత్వాన్ని నిలబెట్టుకొని తిరిగి తన బలాన్ని నిరూపించుకోవాలని ఉబలాటపడుతోంది. 

కరోనా మహమ్మారి విపరీతంగా విజృంభిస్తున్న వేళ ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలను తీసుకొని మూడుదశల్లోను ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. 28 అక్టోబర్ నాడు మొదటి దశ ,పోలింగ్ జరగ్గా, నవంబర్ 3న రెండవ దశ పోలింగ్ జరిగింది. నేడు చివరిదైన మూడవదశ ముగిసింది. 

కరోనా నేపథ్యంలో ఈసారి 80 సంవత్సరాలు పైబడిన వారికి, దివ్యంగులకు పోస్టల్ బాలట్ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. కానీ చాలా వరకు ప్రజలు ఉత్సాహంతో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూతులకే వచ్చారు. 

రాష్ట్రంలో మొత్తం 243 సీట్లకు గాను తొలి దశలో 71 సీట్లకు ఎన్నికలను నిర్వహించారు. రెండవ దశలో 94 సీట్లకు ఎన్నిక నిర్వహించగా... నేడు ఆఖరుదైన మూడవ దశలో మిగిలిన 78 సీట్లకు పోలింగ్ జరిగింది. 

ఎగ్జిట్ పోల్ ఫలితాలు అక్కడి గత పరిస్థితులను, ఓటర్ల ఎన్నుకునే సరళి, ఓటర్ల సమాధానాలు ఇత్యాదుల మీద ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఒక అంచనాను మాత్రమే అందిస్తాయి. గతంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు తారుమారైన సందర్భాలు అనేకం. అసలైన ఫలితాలు తెలుసుకోవాలంటే మాత్రం కౌంటింగ్ జరిగే 10వ తేదీ వరకు వేచి చూడాల్సిందే!