బిహార్ సీఎం నితీశ్ కుమార్ బీజేపీ డిమాండ్లను ఒక్కొక్కటిగా ఎదుర్కొంటూ.. తన ఆలోచనలను ప్రతిఫలించే నిర్ణయాల వైపే మొగ్గుతున్నట్టు స్పష్టం అవుతున్నది. కుల గణనపై ఇటీవలే సానుకూల ప్రకటన చేసిన నితీశ్ కుమార్ తాజాగా బీజేపీ డిమాండ్ చేస్తున్న జనాభా నియంత్రణ చట్టాన్ని వ్యతిరేకించారు. 

పాట్నా: బిహార్ రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. అధికారంలోని జేడీయూకు, బీజేపీకి మధ్య చాలా విషయాల్లో పొంతన కుదరడం లేదు. కానీ, సీఎం నితీష్ కుమార్ పార్టీ జేడీయూకు, ప్రతిపక్షంలోని ఆర్జేడీకి ఏకాభిప్రాయాలు కుదురుతున్నాయి. కుల గణన అయినా.. జనాభా నియంత్రణ చట్టం అయినా.. అధికారం పక్షాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవ్వగా.. జేడీయూ, ఆర్జేడీల వాణి ఒకేలా ఉంది. 

కుల గణనను తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ చివరకు వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. కుల గణనపై మొదటి నుంచి అటు జేడీయూ, ఇటు ఆర్జేడీ పట్టుబట్టాయి. ఎట్టకేలకు ఈ అంశంపై ఓ సానుకూల ప్రకటన అయితే వెలువడింది. కాగా, రాష్ట్ర బీజేపీ నేతలు సహా కేంద్ర ప్రభుత్వ పెద్దలూ జనాభా నియంత్రణ చట్టంపై ఇటీవల తరుచూ మాట్లాడుతున్నారు. కానీ, ఈ చట్ట ప్రతిపాదనను జేడీయూ తీవ్రంగా వ్యతిరేకించింది. తాజాగా, బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ఏకంగా చైనా ఉదాహరణనూ తెచ్చారు.

జననాల రేటును నిజంగా నియంత్రించాలంటే.. అది చట్టాలతో సాధ్యం కాదని, కానీ, ఆడ పిల్లలను అక్షరాస్యులు చేయడం ద్వారా సాధ్యం అవుతుందని సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. పెరుగుతున్న జనాభాను అరికట్టడానికి త్వరలోనే చట్టం తెస్తామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ వ్యాఖ్యలు చేసిన తరుణంలో సీఎం నితీశ్ కుమార్ మాట్లాడారు. ఆడ పిల్లలను, మహిళలకు విద్య అందించడం ద్వారా ఆటో మేటిక్‌గా జననాల రేటు తగ్గుతుందని ఆయన వివరించారు. గత దశాబ్ద కాలంలో తమ ప్రభుత్వం ఇది చేసి చూపెట్టిందని తెలిపారు. ఆడ పిల్లలకు చదువు నేర్పించడంపై తాము శ్రద్ధ పెట్టామని, ఫలితంగా జననాల రేటు 4.3 నుంచి 3కు పడిపోయిందని వివరించారు. మరో ఏడేళ్లలో జననాల రేటును 3 నుంచి 2కు కూడా తీసుకురావొచ్చని వివరించారు.

ఇలాంటి పనులు చేయాలని, కానీ, కేవలం చట్టాన్ని తెచ్చి జనాభాను నియంత్రించడం సాధ్యం కాదని వివరించారు. ఏది చేసినా.. అది ప్రజల జీవితాల్లో సహజంగా మారిపోవాలని సూచించారు. అంతేకానీ, బలవంతంగా చట్టం తెస్తే ఫలితాలు ఏమీ ఉండవని స్పష్టం చేశారు. చైనా కూడా జనాభా నియంత్రణ చట్టం తెచ్చిందని, కానీ, అది ఇప్పుడు ఎంతటి వైఫల్యాలను మూటగట్టుకోవాల్సి వస్తున్నదో చూడాలని సూచనలు చేశారు.

నితీశ్ కుమార్ క్యాబినెట్‌లోని బీజేపీ నేత నీరజ్ కుమార్ సింగ్ కూడా రాష్ట్రంలో జనాభా నియంత్రణ చట్టం తేవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, జేడీయూ మాత్రం ఈ డిమాండ్‌ను తిరస్కరిస్తూ వస్తున్నది.

ఇదిలా ఉండగా.. ఇటీవలే యూపీ ప్రభుత్వం చర్చించిన జనాభా నియంత్రణ చట్టాన్ని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు.