జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీష్ కుమార్.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఏకం కావాలనే అంశంపై ఆయన చర్చించినట్టు వివరించారు. ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయాలనే లక్ష్యంతో ఆయన అపోజిషన్ మిషన్ చేపడుతున్నారు. 

న్యూఢిల్లీ: బిహార్‌లో బీజేపీతో తెగదెంపులు చేసుకుని కాంగ్రెస్‌, ఆర్జేడీతో జేడీయూ చేతులు కలిపిన తర్వాత ప్రతిపక్షాల కూటమి మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ సారి నితీష్ కుమార్ చాలా క్రియాశీలకంగా కనిపిస్తున్నారు. ప్రతిపక్షాలన్నింటినీ ఒక తాటి మీదికి తేవాలని ఆయన కృషి చేస్తున్నారు. ఈ మిషన్ కేసీఆర్ బిహార్ పర్యటనతో మొదలైంది. థర్డ్ ఫ్రండ్ ఎందుకు? మనమే మెయిన్ ఫ్రంట్ అనే అంశంపై కేసీఆర్ పునరాలోచిస్తున్నారు. కాగా, నితీష్ కుమార్ తన అపోజిషన్ మిషన్ కోసం ప్రతిపక్షాల నేతలతో భేటీ కావడానికి పెద్ద షెడ్యూల్ వేసుకున్నారు. తాజాగా, ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిశారు.

తుగ్లక్ రోడ్‌లోని రాహుల్ గాంధీ రెసిడెన్సీలో నితీష్ కుమార్ ఆయనను కలిశారు. వీరి మధ్య చర్చ మొత్తం కూడా 2024 ఎన్నికలపైనే జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశం అనంతరం, నితీష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ, తాను ప్రధాని పోస్టు కోసం పాకులాడటం లేదని స్పష్టం చేశారు. తాను ఆ పదవి కోసం ఆలోచనలు చేయడం లేదనీ అన్నారు. ఆయన బీజేపీతో బంధాన్ని తెంచుకున్న తర్వాత నుంచి ఈ ఆరోపణలు పెరిగాయి. వీటిని ఆయన పలుమార్లు ఖండించారు.

ప్రాంతీయ పార్టీలను బలహీన పరచాలనే ఒక సమన్వయపూర్వక కృషి జరుగుతున్నదని నితీష్ కుమార్ అన్నారు. జనరల్ ఎలక్షన్ కోసం ప్రతిపక్షాలను అన్నింటినీ ఒక చోటికి చేర్చాలన్నదే తన లక్ష్యం అని వివరించారు. తాను స్వయంగా ప్రధానమంత్రి అభ్యర్థిని కావాలని చెప్పుకునే ఉద్దేశం తనకు లేదని
స్పష్టంచేశారు.

ప్రతిపక్షాల్లోనూ రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఉదాహరణకు కాంగ్రెస్‌కు, జేడీఎస్‌కు, కాంగ్రెస్ - ఆప్ లాంటి పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కలిసి ఉండటానికి ఆసక్తి చూపడం లేవు. అయితే, నితీష్ కుమార్ మాత్రం ఈ పార్టీల నేతలు అందరినీ కలుసుకుని తన ప్రతిపాదనను వారి ముందు పెడతామని వివరించారు. మూలాల్లో వారి మధ్య భావజాల సారూప్యత లేని, భిన్నాభిప్రాయాలు కలిగిన పార్టీల నేతలతోనూ ఆయన మాట్లాడనున్నారు.

రాహుల్ గాంధీ తర్వాత నితీష్ కుమార్.. ఢిల్లీ సీఎం అరవింద్ కజ్రీవాల్‌తో సమావేశం కాబోతున్నారు. అలాగే, జేడీఎస్ చీఫ్ హెచ్ డీ కుమారస్వామితోనూ ఆయన భేటీ కాబోతున్నారు. కర్ణాటకలో 2018లో బీజేపీని దూరం పెట్టి కాంగ్రెస్ జేడీఎస్ అధికారంలోకి వచ్చినా చివరకు వరకు నిలువలేదు.

కాంగ్రెస్ తీరు పై అసహనం ఉన్న అఖిలేశ్ యాదవ్ కూడా అపోజిషన్ మిషన్‌లో చేరడానికి ముందుకు వస్తున్నారు. అంతేకాదు, మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటకలోనూ ఈ అపోజిషన్ మిషన్‌లో భాగంగా పర్యటించబోతున్నట్టు నితీష్ కుమార్ పార్టీ జేడీయూ వర్గాలు వివరించాయి.