Asianet News TeluguAsianet News Telugu

సోనియా గాంధీని క‌ల‌వ‌నున్న బీహార్ సీఎం నితీష్ కుమార్, లాలూ ప్ర‌సాద్ యాద‌వ్

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. రాష్ట్రీయ జనతాదళ్ (RJD) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలుసుకున్నారు. ఆయనతో పాటు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కూడా ఉన్నారు. 

Bihar CM Nitish Kumar, Lalu Prasad Yadav to meet Sonia Gandhi
Author
First Published Sep 12, 2022, 1:57 PM IST

Nitish-Lalu-Sonia meeting: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్ని ఏకం అవుతున్నాయి. దీని కోసం ప‌లు పార్టీల నాయ‌కులు ఇత‌ర నాయ‌కుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. బీజేపీతో తెగ‌తెంపులు చేసుకున్న జేడీ(యూ) నాయ‌కుడు నితీష్ కుమార్.. కాంగ్రెస్, ఆర్జేడీలు స‌హా ప‌లు పార్టీల‌తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేర్పాటు చేశారు. అనంత‌రం బీజేపీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. దానికి వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్షాల‌ను ఏకం చేయడం కోసం విప‌క్ష పార్టీల నేత‌ల‌తో వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌తిప‌క్షాల ఐక్య‌త కోసం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆయ‌న‌ మిత్రుడు లాలూ యాదవ్ త్వరలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలవనున్నారు. 2024 జాతీయ ఎన్నికలకు సన్నాహకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్‌ను ఏర్పరచడానికి ప్రతిపక్షాల ప్రయత్నాల మధ్య తేజస్వి యాదవ్ సోమవారం నాడు ఈ వివ‌రాలు వెల్ల‌డించారు.

“మేడమ్ సోనియా జీ తిరిగి వచ్చిన తర్వాత, ఒక సమావేశం జరుగుతుంది. వారిద్దరూ ( నితీష్ కుమార్-లాలూ ప్ర‌సాద్ యాదవ్) కలిసి వెళతారు” అని బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయ‌కుడు తేజ‌స్వీ యాద‌వ్ విలేకరులతో అన్నారు. నితీష్ కుమార్ ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఆసక్తిగా ఉన్నారని చెప్పిన కొద్ది రోజుల తర్వాత ఆయ‌న ఈ విష‌యాలు వెల్ల‌డించ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. గత వారం త‌న తన ఢిల్లీ పర్యటనలో నితీష్ కుమార్..  కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ నాయ‌కుడు, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులను కలిశారు. ఆ స‌మ‌యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వైద్య పరీక్షల నిమిత్తం విదేశాల్లో ఉన్నారు. ప‌లు పార్టీల నాయ‌కుల‌ను క‌లిసిన త‌ర్వాత నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. "మేము ప్రధాన ఫ్రంట్ కావాలనుకుంటున్నాము.. మూడవ ఫ్రంట్ కాదు" అనినొక్కి చెప్పారు. నితీష్ కుమార్.. సమాజ్‌వాదీ పార్టీ పితామహుడు ములాయం సింగ్ యాదవ్‌ను కూడా క‌లిశారు. దాని తర్వాత లక్నోలోని ఎస్‌పీ ప్రధాన కార్యాలయంలో "యూపీ + బీహార్ = గయా మోడీ సర్కార్" అనే నినాదంతో బ్యానర్ కనిపించింది. ఈ పోస్ట‌ర్లు వైర‌ల్ కావ‌డంతో పాటు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు తెర‌లేపాయి. 

కొత్త‌గా ఏర్ప‌డిన బీహార్ సంకీర్ణ ప్ర‌భుత్వం.. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన  వాగ్దానాన్ని విమర్శిస్తున్న వారిపై మండిప‌డ్డారు. “ఇది నమ్మని వారు వేచి ఉండి చూడాలి. అది తప్పకుండా జరుగుతుంది. ఎవరైనా ఏమి చెప్పినా నేను దానిపై మాట్లాడ‌ద‌లుచుకోలేదు”అని ఆయన చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది. "మేము ప్రభుత్వంలో ఉన్నాము. ఇది మా నిబద్ధత, ఇది ఖచ్చితంగా జరుగుతుంది.. ఉద్యోగ హామీ నిల‌బెట్టుకుంటాం" అని అన్నారు. ఏన్డీయే కూట‌మికి గుడ్ బై చెప్ప‌డంతో పాటు బీహార్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్ప‌టు త‌ర్వాత బీజేపీ ఆందోళ‌నకు గుర‌వుతున్న‌ద‌ని అన్నారు. “ఇది బీజేపీకి అభద్రతాభావం కలిగించింది. తమ కేడర్ నైతిక స్థైర్యాన్ని పెంచుకునేందుకు ఇప్పుడు 350 సీట్లు లక్ష్యంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సోషలిస్టు రాజకీయాలను నిర్మూలించాలనుకున్నారు. ప్రాంతీయ పార్టీలను అంతం చేయాలని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా బహిరంగంగా పిలుపునిచ్చారు. జేడీ(యూ)ని  విచ్ఛిన్నం చేయాలనుకున్నారు. మనం ఏం చేశామనే సందేశం దేశమంతటా వ్యాపించింది. ఇది ప్రతిపక్ష శ్రేణుల్లో ఆశను రేకెత్తించింది' అని తేజ‌స్వీ యాదవ్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios