బీహార్ : కాసేపట్లో సీఎం పదవికి రాజీనామా చేయనున్న నితీష్ కుమార్ ..?
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఇవాళ తన పదవికి రాజీనామా చేయనున్నారు. శనివారం రాత్రి 7 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి తన రాజీనామా సమర్పించే అవకాశం వుందని జాతీయ వార్తా సంస్థ టైమ్స్ నౌ కథనాన్ని ప్రసారం చేసింది.
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఇవాళ తన పదవికి రాజీనామా చేయనున్నారు. శనివారం రాత్రి 7 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి తన రాజీనామా సమర్పించే అవకాశం వుందని జాతీయ వార్తా సంస్థ టైమ్స్ నౌ కథనాన్ని ప్రసారం చేసింది.
కాగా.. ఇండియా కూటమి కోసం మొదటి నుంచి ప్రయత్నాలు చేసిన నితీశ్ కుమార్ ఇప్పుడు ఆ కూటమిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కూటమి బాధ్యతల్లో కీలక పదవి దక్కకపోవడం, సీట్ల పంపకాల్లోనూ కాంగ్రెస్ జాప్యంతో ఆయన తిరిగి బీజేపీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నట్టు కొన్ని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 28వ తేదీన నితీశ్ కుమార్ అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నాడు. ఓ కార్యక్రమంలో ప్రసంగించాల్సిన పనిని కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. దీంతో ఆదివారం ఆయన బీజేపీ-జేడీయూ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయవచ్చని చెబుతున్నారు. ఆయనకు బీజేపీకి చెందిన ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారనీ చర్చ జరుగుతున్నది.
నితీశ్ కుమార్ పార్టీ కూటమి మారడం మూలంగా అసెంబ్లీని రద్దు చేయాలనే ఆలోచనలేమీ లేవని తెలుస్తున్నది. ఎన్నికలూ జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే బిహార్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. కాబట్టి, ఏ పార్టీ కూడా ఎన్నికల కోసం హడావుడిలో లేవు. ఇప్పుడు పార్టీ ఫోకస్ అంతా కూడా లోక్ సభ ఎన్నికలపై ఉన్నాయి. ఈ సారి లోక్ సభ సీట్ల సంఖ్యను తగ్గించినా నితీశ్ కుమార్ బీజేపీ కూటమిలో చేరడానికి అంగీకరించారని కొన్ని వర్గాలు తెలిపాయి. 2019లో జేడీయూ 17 లోక్ సభ సీట్లలో పోటీ చేయగా అందులో 16 స్థానాలను గెలుచుకుంది. కానీ, ఈ సారి జేడీయూకు 12 నుంచి 15 సీట్లను మాత్రమే కేటాయిస్తామని, ఇతర పార్టీలకూ సీట్లు కేటాయించాల్సి ఉన్నదని బీజేపీ కండీషన్ పెట్టినా.. అందుకు జేడీయూ అంగీకరించినట్టు సమాచారం.
వీటిపై అధికారిక ప్రకటన ఒక్కటి కూడా ఇది వరకు రాలేదు. కానీ, బీజేపీ నుంచి వస్తున్న స్పందనతోనే అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు సీఎంగా నితీశ్ కుమార్ ఉండగా.. ఆయనకు డిప్యూటీగా బీజేపీ ఎమ్మెల్యే సుశీల్ కుమార్ మోడీ ఉన్నారు. ఆయన ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా చేస్తున్నారు. బీజేపీ నుంచి జేడీయూ తెగతెంపులు చేసుకున్న తర్వాత నితీశ్ కుమార్‌ను సుశీల్ కుమార్ మోడీ తరుచూ విమర్శించేవారు. కానీ, ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చని, ఎవరికీ ద్వారాలు శాశ్వతంగా మూసివేసి ఉండవని కామెంట్ చేశారు. అవసరాన్ని బట్టి ఎవరికైనా ద్వారాలు తెరుచుకుంటాయని వివరించారు.