Patna: కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారనీ, అందుకే ఆయనకు జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) ఉద్యమం గురించి గానీ, రామ్ మనోహర్ లోహియా వంటి సోషలిస్టు నేతల గురించి గానీ అవగాహన లేదంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఫైర్ అయ్యారు.  

Bihar Chief Minister Nitish Kumar: భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి ఇటీవ‌ల నితీష్ కుమార్ నాయ‌క‌త్వంలోని జేడీ(యూ) బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ త‌ర్వాత కాంగ్రెస్, ఆర్జేడీ తో పాటు స్థానిక పార్టీలతో క‌లిసి బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మ‌రోసారి నితీష్ కుమార్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అప్ప‌టి నుంచి రాష్ట్రంలో పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి. ముఖ్యంగా జేడీ(యూ)-బీజేపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం తీవ్ర‌స్థాయిలో కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే నితీష్ కుమార్ మ‌రోసారి బీజేపీ, ఆ పార్టీ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. హోం మంత్రి అమిత్ షాకు దేశ చ‌రిత్ర తెలియ‌దంటూ ఫైర్ అయ్యారు. 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. అందుకే ఆయనకు జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) ఉద్యమం గురించి గానీ, రామ్ మనోహర్ లోహియా వంటి సోషలిస్టు నేతల గురించి గానీ అవగాహన లేదు. అమిత్ షా లాంటి వారికి దేశ చ‌రిత్ర తెలియ‌దు: బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నాయకుడు నితీశ్ కుమార్

“అతని (అమిత్ షా) లాంటి వ్యక్తులకు దేశానికి ఎలాంటి సహకారం లేదు.. అతనికి దేశ చరిత్ర తెలియదు. వారికి జయప్రకాష్ నారాయణ్ జీ గురించిన‌ జ్ఞానం లేదు. వారు ప్రభుత్వంలో కొనసాగే అవకాశం పొందుతారు. అందుకే నాకు వ్యతిరేకంగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు" అని నితీష్ కుమార్ అన్నారు. సోషలిస్ట్ నాయకుడు రామ్ మనోహర్ లోహియా వర్ధంతి సందర్భంగా పాట్నాలోని ఆయన విగ్రహం వద్ద నివాళులర్పించారు. అనంత‌రం ఆయ‌న పై వ్యాఖ్య‌లు చేశారు. ‘‘ఆ రాష్ట్ర ప్రజల ఆహ్వానం మేరకు నేను నాగాలాండ్ వెళ్లాను.. అదొక గొప్ప కార్యక్రమం. జయప్రకాష్ నారాయణ్ జీ అంటే నాగాలాండ్ ప్రజలకు ఎంతో గౌరవం. 1964 నుంచి 1967 వరకు మూడేళ్లపాటు అక్కడే ఉండి అప్పటి సమస్యలను ప్రస్తావించారు" అని నితీష్ కుమార్ అన్నారు. స్వాతంత్య్ర పోరాటం, జేపీ ఉద్యమంపై ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర హోంమంత్రికి ఏమాత్రం అవగాహన లేదని అన్నారు. 

2002 తర్వాతే ప్ర‌ధాని మోడీ రాజకీయ నాయకుడిగా ప్రాముఖ్యతను సంతరించుకున్నారని నితీష్ కుమార్ తెలిపారు. బీహార్‌లోని సరన్ జిల్లాలోని జయప్రకాశ్ నారాయణ్ జన్మస్థలమైన సితాబ్ దియారాకు అమిత్ షా మంగళవారం వచ్చారు. బీహార్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసమే జయప్రకాశ్‌ నారాయణ్‌ను జైలుకు పంపిన కాంగ్రెస్‌ ఒడిలో బీహార్‌ ముఖ్యమంత్రి కూర్చున్నారని విమ‌ర్శించారు. జేడీ(యూ) నాయ‌కుల‌తో పాటు బీహార్ సంకీర్ణ ప్రభుత్వంపై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ నితీష్ కుమార్ బీజేపీకి కౌంట‌రిచ్చారు. 20 ఏళ్ల క్రితం రాజకీయ జీవితం ప్రారంభించిన వ్యక్తులకు తాను ప్రాధాన్యత ఇవ్వదలచుకోలేదంటూ అమిత్ షా పై ఎదురుదాడి చేశారు. 

కాగా, ఎన్డీయే కూటామి నుంచి వైదొలిగిన త‌ర్వాత నితీష్ కుమార్.. కేంద్రంలోని బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను ఏకం చేసేందుకు వివిధ పార్టీల నాయ‌కుల‌ను క‌లిసి చ‌ర్చ‌లు జ‌రిపారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని ఆరోపించిన ఆయన, ఒక వర్గాన్ని మరో వర్గానికి వ్యతిరేకంగా ఇరికించే ప్రయత్నాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.