Asianet News TeluguAsianet News Telugu

10 లక్షల ఉద్యోగాలిస్తాం.. మరో పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం: సీఎం బిగ్ అనౌన్స్‌మెంట్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు చేపట్టిన సంక్షేమ పథకాలు, త్వరలో తీసుకోబోతున్న మరిన్ని కీలక నిర్ణయాలను ఏకరువు పెట్టడం కద్దు. ఇందులో భాగంగా బిహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. పది లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. అంతేకాదు, మరో పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు.
 

bihar cm nitish kumar announces 10 lakh jobs and 10 lakh employment in independence day speech
Author
First Published Aug 15, 2022, 12:40 PM IST

న్యూఢిల్లీ: బిహార్‌లో కొత్తగా అధికారాన్ని చేపట్టిన జేడీయూ, ఆర్జేడీ అలయెన్స్ ప్రభుత్వం పంద్రాగస్టున సంచలన ప్రకటన చేసింది. తమ హయాంలో పది లక్షల మందికి ఉద్యోగాలిస్తామని సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. అంతేకాదు, వేర్వేరు రూపాల్లోనైనా మరో 10 లక్షల మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. ఆయన ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మాట్లాడారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ ఈ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తమకు అధికారాన్ని కట్టబెడితే పది లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ హామీతో ఆర్జేడీ ఘనంగా సీట్లు గెలుచుకుంది. కానీ, అధికారంలోకి రాలేకపోయింది. నితీష్ కుమార్ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వమే బిహార్‌లో అప్పుడు కొలువుదీరింది. కానీ, ఇటీవలే ఆయన ఆర్జేడీతో చేతులు కలిపి మహాఘట్ బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా ఆయన మళ్లీ సీఎంగా ప్రమాణం తీసుకున్నారు. డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్ బాధ్యతలు తీసుకున్నారు.

జేడీయూ.. ఆర్జేడీ దరికి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలు, మీడియా, ఇతరులు అందరూ తేజస్వీ యాదవ్ ఎన్నికల క్యాంపెయిన్‌లో చేసిన 10 లక్షల ఉద్యోగాల హామీ గురించే ప్రశ్నించారు. పది లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. దీనికి కొంత సమయం ఇవ్వండి తేజస్వీ యాదవ్ తెలిపారు. అంతేకాదు, హిందూ, ముస్లిం మధ్య ఘర్షణలు రెచ్చగొట్టే, మతపరమైన విషయాలు కాదని, వాస్తవమైన నిరుద్యోగ సమస్య గురించి ప్రతిపక్షం, మొన్నటి వరకు దీని ఊసే ఎత్తని మీడియా కూడా ప్రశ్నించడం ఆహ్వానించదగ్గ పరిణామం అని తేజస్వీ  యాదవ్ అన్నారు.

ఈ రోజు సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ, మన పిల్లలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన కోసం చాలా చేస్తామని వివరించారు. ప్రభుత్వ పరిధితోపాటు, ఇతర రంగాల్లోనూ వీటి కల్పన కోసం ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ఈ ప్రయత్నంలో తాము విజయం సాధిస్తే.. పది లక్షల ఉద్యోగాల సంఖ్యను మరింత పెంచుతామని వివరించారు. అంటే.. పది లక్షల ఉద్యోగాలతోపాటు మరో పది లక్షల మందికి ఉపాధి కూడా కల్పిస్తామని చెప్పారు. దీన్ని కార్యరూపంలోకి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం హార్డ్ వర్క్ చేస్తుందని వివరించారు.

సీఎం ప్రకటన తర్వాత తేజస్వీ యాదవ్ కూడా ఈ అంశంపై ట్వీట్ చేశారు. ఈ రోజు సీఎం నితీష్ కుమార్ బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారని పేర్కొన్నారు. పది లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు మరో పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని సీఎం ప్రకటించారని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios