land-for-jobs scam: భూ కుంభకోణం కేసులో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ తో పాటు మ‌రో మరో 15 మందిపై సీబీఐ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. లాలూ ప్రసాద్ కుమార్తె మిసా భారతి, రైల్వే మాజీ జనరల్ మేనేజర్‌లను కూడా నిందితులుగా పేర్కొంటూ ఇటీవల సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో పేర్కొన్నారు. 

Bihar-Lalu Prasad Yadav: రైల్వేలో ఉద్యోగాల కోసం జరిగిన భూ కుంభకోణంలో మాజీ రైల్వే మంత్రి, రాష్ట్రీయ జనతా ద‌ళ్ (ఆర్జేడీ) నాయ‌కుడు లాలూ ప్రసాద్ యాద‌వ్ తో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, మరో 14 మందిపై సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కుమార్తె మిసా భారతి, రైల్వే మాజీ జనరల్ మేనేజర్‌లను కూడా ఇటీవల సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో నిందితులుగా పేర్కొన్నారు. రైల్వే విభాగంలో ఆరోపించిన భూ ఉద్యోగాల కుంభకోణానికి సంబంధించి 2021 సెప్టెంబర్ 23న కేంద్ర ఏజెన్సీ ప్రాథమిక విచారణను నమోదు చేసింది, దానిని మే 18న ఎఫ్‌ఐఆర్‌గా మార్చారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతి, మరో 13 మందిపై ఆయన పదవీకాలంలో జరిగిన భూ కుంభకోణంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చార్జ్ షీట్ దాఖలు చేసింద‌ని రైల్వే వర్గాలు శుక్రవారం తెలిపాయి. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో గ్రూప్ డీలో పాట్నాకు చెందిన 12 మందికి రహస్యంగా ఉద్యోగాలు ఇప్పించారనీ, పాట్నాలోని భూమిని తన కుటుంబ సభ్యుల పేర్లపై రాయించుకున్నారని ఆరోపించారు. లాలూ భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతి, హేమా యాదవ్ పేర్లపై ప్లాట్లు రిజిస్టర్ అయ్యాయనీ, భూమికి నామమాత్రపు విలువను నగదు రూపంలో చెల్లించారని సీబీఐ పేర్కొంది.

చార్జిషీట్‌లో మాజీ రైల్వే మంత్రి లాలూ ప్ర‌సాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, ఆయన కుమార్తె మిసా భారతితో పాటు మొత్తం 16 మంది నిందితుల పేర్లు ఉన్నాయి. రైల్వే అధికారులు భూముల బదులు అభ్యర్థులకు హడావుడిగా ఉద్యోగాలు ఇప్పించారని చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ప్రతిఫలంగా, ఈ వ్యక్తులు రబ్రీ దేవి, మిసా భారతి, ఇతరుల పేరు మీద భూమి రాసిఇచ్చారు. శుక్రవారం అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి గీతాంజలి గోయెల్ ఎదుట రూస్ అవెన్యూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే, న్యాయమూర్తి సెలవులో ఉన్నందున చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోలేదు.

కాగా, ఈ ఏడాది ఆగస్టులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబసభ్యులు, ఆర్‌జేడీకి సంబంధించిన వ్యక్తుల స్థలాలన్నింటిపై సీబీఐ దాడులు చేసింది. బీహార్, ఢిల్లీ, హర్యానాలోని 25 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ కేసులో అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ 120బీ కింద సీబీఐ 2022 మే 18న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఇందులో లాలూ ప్ర‌సాద్ యాదవ్‌, ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌లతో సహా 12 మందిపై కూడా లాలూ కుటుంబానికి భూములిచ్చి ఉద్యోగాలు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

ఈ 'ఉద్యోగ‌-భూ కుంభకోణం' ఏమిటి? 

మీడియా (ఆజ్తక్..) నివేదికల ప్ర‌కారం.. పాట్నాలో మూడు సేల్ డీడ్‌లు రబ్రీ దేవి పేరు మీద ఉన్నాయి. రెండు దస్తావేజులు ఫిబ్రవరి 2008 నాటివి. ఇందులో 3375-3375 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 ప్లాట్లు ఉన్నాయి. మూడవ సేల్ డీడ్ 2015 నాటిది. ఇందులో 1360 చదరపు అడుగుల ప్లాట్ ఉంది. ఇది కాకుండా, పాట్నాలోనే 2007 సేల్ డీడ్ లాలూ కుమార్తె మిసా భారతి పేరు మీద ఉంది. అందులో ఆమెకు 80,905 చదరపు అడుగుల ప్లాట్ ఇచ్చారు. పాట్నాలోనే లాలూ కూతురు హేమా యాదవ్ పేరిట రెండు గిఫ్ట్ డీడ్‌లు ఉన్నాయి. ఇందులో హేమ యాదవ్‌కు 3375 చదరపు అడుగుల ప్లాట్‌ ఇచ్చారు. మరో 3375 చదరపు అడుగుల స్థలాన్ని 2014లో హేమ యాదవ్‌కు బహుమతిగా ఇచ్చారు. 

అలాగే, ఒక కంపెనీ పేరుతో డీడీ చేసి అందులో 9527 చదరపు అడుగుల స్థలం ఇచ్చారు. తర్వాత రబ్రీ దేవి ఈ కంపెనీకి డైరెక్టర్‌ అయ్యారు. లాలూ కుటుంబ సభ్యులకు ఈ భూములను ఎవరు లేదా వారి కుటుంబ సభ్యులు ఇచ్చారో, వారందరికీ లాలూ యాదవ్ మంత్రులుగా ఉన్నప్పుడు రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.