Asianet News TeluguAsianet News Telugu

బీహార్‌లో కొలువుదీరిన మంత్రివర్గం.. ఆర్జేడీకి పెద్ద పీట.. కేబినెట్‌లో తేజ్ ప్రతాప్‌కు చోటు..

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. బీహార్‌ రాజధాని పట్నాలో ఉదయం 11.30 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కొత్త మంత్రుల చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. 

Bihar Cabinet Expansion 31 Ministers Inducted RJD Gets 16 berths
Author
First Published Aug 16, 2022, 12:52 PM IST

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఈ నెల ప్రారంభంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆర్జేడీ, ఇతర పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఆగస్టు 10వ తేదీన బిహార్ సీఎంగా నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంగా ఆర్జేడీ  నేత తేజస్వి యాదవ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తాజాగా నేడు నితీష్ కుమార్ తన మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. 

బీహార్‌ రాజధాని పట్నాలో ఉదయం 11.30 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కొత్త మంత్రుల చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌, ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్‌ హాజరయ్యారు. 31 మంది ఎమ్మెల్యేలు మంత్రలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇందులో సింహా భాగం కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న ఆర్జేడీ దక్కించుకుంది. RJDకి చెందిన 16 మందికి మంత్రి పదవులు లభించాయి. జేడీయూకు చెందిన 11 మందికి మంత్రిపదవులు దక్కాయి. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు శాసనసభ్యులు,  హిందుస్థానీ అవామ్ మోర్చా నుండి ఒకరు, ఏకైక స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

అశోక్ చౌదరి, లేషి సింగ్, విజయ్ కుమార్ చౌదరి, సంజయ్ ఝా, షీలా కుమారి, సునీల్ కుమార్ మదన్ సాహ్ని, బిజేంద్ర యాదవ్‌లతో సహా నితీష్ కుమార్ తన పార్టీ నుంచి గతంలో ఉన్న చాలా మంది మంత్రులను కొనసాగించారు. ఆర్జేడీ నుంచి లాలూ మరో కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు కూడా కేబినెట్‌లో బెర్త్ దక్కింది. ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్, అలోక్ మెహతా, సురేంద్ర ప్రసాద్ యాదవ్ మరియు రామానంద్ యాదవ్, కుమార్ సర్వజీత్, సమీర్ కుమార్ మహాసేత్, చంద్రశేఖర్, లలిత్ యాదవ్ క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్‌ నుంచి అఫాక్‌ ఆలం, మురారీ లాల్‌ గౌతమ్‌లు మంత్రివర్గంలోకి చేరగా.. హిందుస్థానీ అవామ్‌ మోర్చాకు చెందిన సంతోష్‌ సుమన్‌ కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

బీహార్ కేబినెట్‌లో ముఖ్యమంత్రితో సహా 36 మంది మంత్రులు ఉండవచ్చు. అయితే భవిష్యత్తులో జరిగే మంత్రివర్గ విస్తరణ కోసం కొన్ని మంత్రి పదవులు ఖాళీగా ఉంచినట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ఇక, బీహార్‌లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వంలో.. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌లతో ఇతర పార్టీలు భాగస్వామ్యంగా ఉన్నాయి. ఈ కూటమి బలం 163గా ఉంది. ఇక, నితీష్ కుమార్‌కు స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్ మద్దతు ఇవ్వడంతో కూటమి బలం 164కి చేరుకుంది. ఇదిలా ఉంటే.. ఆగస్టు 24న బీహార్ అసెంబ్లీలో కొత్త ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios