Asianet News TeluguAsianet News Telugu

నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసు.. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం..

Bihar Bridge Collapse:  భాగల్‌పూర్‌లోని అగువానీ-సుల్తాన్‌గంజ్ వంతెన కూలిపోవడంతో బీహార్ ప్రభుత్వం మంగళవారం నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసు ఇచ్చింది.

Bihar Bridge Collapse Show Cause Notice Given To Construction Company KRJ
Author
First Published Jun 6, 2023, 11:45 PM IST

Bihar Bridge Collapse: బీహార్ లోని భాగల్‌పూర్, ఖగారియా జిల్లాలను కలిపేలా గంగా నదిపై రూ.1,700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన కూలిపోయింది. ఈ ఘటనపై నితీష్ కుమార్ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వంతెన నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. వంతెన నిర్మాణం చేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను సస్పెండ్ చేసింది. 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఘటనపై బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. భాగల్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంపై  విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై ఐఐటి రూర్కీ ఇప్పటికే దర్యాప్తు చేస్తోందని తెలిపారు. సీఎం కలల ప్రాజెక్టు కావడంతో నిర్ణీత గడువులోగా వంతెన నిర్మిస్తామన్నారు. నిర్మాణ సంస్థకు షోకేస్ నోటీసు జారీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వంతెన 5వ నంబర్‌ పిల్లర్‌ అంశాన్ని ప్రశ్నించనని గుర్తు చేశారు.  

ఈ విషయంపై ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న బిజెపిపై తేజస్వి మాట్లాడుతూ.. గత సంవత్సరం ఈ వంతెనలో కొంత భాగం తుఫానులో కొట్టుకుపోయిందని అన్నారు. అప్పుడు రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ అంశం విస్తృతంగా చర్చనీయాంశమైంది. నాటి ప్రతిపక్ష నేతగా నేను దానిని బలంగా లేవనెత్తాను. అధికారంలోకి రాగానే విచారణకు ఆదేశించి నిపుణుల అభిప్రాయం కోరామని తెలిపారు. 

రోడ్డు నిర్మాణ శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి ప్రత్యయ్ అమృత్ మాట్లాడుతూ.. కాంట్రాక్టు పొందిన హర్యానాకు చెందిన కంపెనీకి బీహార్ స్టేట్ బ్రిడ్జ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కు షోకాజ్ నోటీసు జారీ చేసి.. 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కోరారు. కంపెనీని ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో ఎందుకు పెట్టకూడదని, దానిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ఆయన ప్రశ్నించారు.  పనుల నాణ్యతను పర్యవేక్షించడంలో విఫలమైనందుకు సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను డిపార్ట్‌మెంట్ సస్పెండ్ చేసిందని అదనపు ప్రధాన కార్యదర్శి తెలియజేశారు.

భాగల్‌పూర్, ఖగారియా జిల్లాలను కలిపేలా గంగా నదిపై రూ.1,700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంతెనలో కొంత భాగం ఆదివారం కూలిపోయింది. ఏడాది క్రితం కూడా వంతెనలో కొంత భాగం కూలిపోయింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2014 ఫిబ్రవరిలో వంతెనకు శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణం 2019 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు.కానీ ఆలస్యం జరుగుతూనే వస్తోంది. గతంలోనూ బ్రిడ్జిలో కొంత భాగం కూలిపోవడం, పనుల్లో నాణ్యత లోపం, పూర్తి చేయడంలో జాప్యంపై ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

మరోవైపు ఆదివారం బీహార్‌లోని భాగల్‌పూర్‌లో అగువానీ-సుల్తాన్‌గంజ్ వంతెన కూలిన ఘటనపై స్వతంత్ర విచారణ జరిపించాలని పాట్నా హైకోర్టులో పిల్ దాఖలైంది. పిటిషనర్ మణిభూషణ్ ప్రతాప్ సెంగార్ తన రిట్ పిటిషన్‌లో శాఖాపరమైన విచారణకు బదులుగా స్వతంత్ర దర్యాప్తు, వంతెన నిర్మాణానికి సంబంధించిన ఎస్పీ సింగ్లా కంపెనీపై చర్య తీసుకోవాలని కోరారు. బ్రిడ్జి కూలిపోవడంతో ఖజానాకు జరిగిన వేల కోట్ల రూపాయల నష్టాన్ని కూడా రికవరీ చేయాలని పిఐఎల్ కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios