Asianet News Telugu

నితీశ్ పాదాలకు మొక్కి.. అంతలోనే బాంబు పేల్చిన చిరాగ్ పాశ్వాన్

కూటములు, స్నేహాలు, ఎత్తులు, పై ఎత్తులతో బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమరం వాడి వేడిగా సాగుతోంది. ప్రధాని పార్టీల నేతలు తమ ప్రత్యర్ధులపై మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. 

Bihar Assembly Elections 2020: Chirag Paswan Touched Nitish Kumar's Feet ksp
Author
Patna, First Published Oct 21, 2020, 2:49 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కూటములు, స్నేహాలు, ఎత్తులు, పై ఎత్తులతో బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమరం వాడి వేడిగా సాగుతోంది. ప్రధాని పార్టీల నేతలు తమ ప్రత్యర్ధులపై మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

ఇటీవల కన్నుమూసిన కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ స్మారకార్థం మంగళవారం సాయంత్రం పాట్నాలో ఓ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముగ్గురు రాజకీయ ప్రత్యర్థులు ఒకే వేదికను పంచుకున్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్, లోక్‌ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్.. పక్కపక్కనే కూర్చొన్నారు.

ఈ సందర్భంగా నితీశ్ కుమార్ అటు చిరాగ్ పాశ్వాన్‌తో, ఇటు తేజస్వి యాదవ్‌తో కొద్దిపాటి సంభాషణ జరిగినట్లుగా తెలుస్తోంది. చిరాగ్ పాశ్వాన్.. సీఎం నితీశ్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నట్లు ఎల్‌జేపీ నేతలు తెలిపారు. పాశ్వాన్ సతీమణి రీనా పాశ్వాన్‌‌తోనూ నితీశ్ కాసేపు ముచ్చటించారు. 

కాగా , తన తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ ఆస్పత్రిలో ఉన్న సమయంలో నితీశ్ కనీసం ఫోన్ ద్వారా కూడా పరామర్శించలేదంటూ ఇటీవల చిరాగ్ పాశ్వాన్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

అంతేకాదు,రాజ్యసభ ఎన్నికల సమయంలో తన తండ్రిని నితీశ్ ఘోరంగా అవమానించారని ఆరోపించారు. తన తండ్రి భౌతిక కాయాన్ని ఢిల్లీ నుండి పాట్నాకు తరలించే సమయంలో విమానాశ్రయంలో ఉన్న నితీష్‌ కనీసం ఆయనకు నివాళి అర్పించలేదని చిరాగ్ ఆరోపించారు.

అలాగే తాను నితీశ్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నం చేసినా పెద్దగా పట్టించుకోలేదని మండిపడ్డారు. తాజా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే నుంచి బయటకొచ్చిన చిరాగ్... జేడీయూకి వ్యతిరేకంగా అభ్యర్థులను కూడా నిలిపిన సంగతి తెలిసిందే.

గతంలో మహాకూటమి సంకీర్ణ సర్కార్‌ విచ్చిన్నానికి కారకుడైన నితీశ్‌ను ఈసారి ఎలాగైనా ఓడించి తీరాలన్న పట్టుదలతో తేజస్వి యాదవ్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.

నితీశ్ హయాంలో రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ది జరగలేదని, తీవ్ర నిరుద్యోగ సమస్య నెలకొందని ఎన్నికల ర్యాలీల్లో తేజస్వి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మహాకూటమిని గెలిపిస్తే.. అధికారంలోకి రాగానే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు.

అయితే అన్ని ఉద్యోగాలకు జీతాలిచ్చేందుకు అసలు డబ్బులు ఎక్కడినుంచి తీసుకొచ్చారు... దొంగ నోట్లు ముద్రిస్తారా లేక జైల్లో నుంచి తీసుకొస్తారా అని నితీశ్ సెటైర్లు వేశారు.

అలా ప్రచారంలో హోరాహోరిగా తలపడుతున్న ముగ్గురు నేతలు ఒకే వేదికను పంచుకోవడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ ముగ్గురు సోఫాలో పక్కపక్కనే కూర్చొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

మరోవైపు ఈ కార్యక్రమం ముగించుకుని సీఎం నితీశ్ వెళ్లిన కాసేపటికే చిరాగ్ పాశ్వాన్ తన అభ్యర్ధుల జాబితాను విడుదల చేశారు. జేడీయూ నేత కుమార్తె కోమల్ సింగ్‌ను ఎల్‌జేపీ అభ్యర్ధిగా ప్రకటించడం సంచలనం కలిగించింది.

కోమల్ సింగ్ తల్లి వీణా సింగ్ ఎల్‌జేపీ నుంచి వైశాలి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. గైఘాట్ నుంచి పార్టీ అభ్యర్ధిని ప్రకటించడానికి చిరాగ్ పాశ్వాన్‌తో కోమల్ తండ్రి దినేశ్ సింగ్ స్వయంగా మాట్లాడారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ స్థానం నుంచి జేడీయూ అభ్యర్ధిగా మహేశ్వర్ యాదవ్ టికెట్ దక్కించుకున్నారు. అయితే దినేశ్ సింగ్ తన కుమార్తెను జేడీయూ అభ్యర్ధుల జాబితాలో చేర్చేందుకు ప్రయత్నించడా లేదా అన్నది తెలియాల్సి వుంది. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 7 మధ్య బీహార్‌లో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి నవంబర్ 10న ఫలితాలను ప్రకటిస్తారు. 

Follow Us:
Download App:
  • android
  • ios