పెళ్లి మండపం వధూవరులతో... బంధువులతో కలకలలాడాల్సింది పోయి రక్తపు మడుగులతో నిండిపోయింది. ఓ ట్రక్కు.. అదుపుతప్పి పెళ్లి మండపంలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో 8మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన బిహార్ రాష్ట్రంలోని లఖీసరాయ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... లఖీసరాయ్ ప్రాంతంలో గురువారం ఉదయం ఓ పెళ్లి జరగుతోంది. ఆ పెళ్లి మండపం రోడ్డు పక్కనే ఉండటం గమనార్హం. కాగా... రోడ్డుపై వెళుతున్న ఓ ట్రక్కు అదుపుతప్పి.. పెళ్లి మండపంలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.