మహిళల పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. ట్యూబెక్టమీ శస్త్ర చికిత్స కోసం వచ్చిన మహిళలకు అనస్థీషియా (మత్తు) ఇవ్వకుండానే 23మంది మహిళలకు ట్యూబెక్టమీ ఆపరేషన్లు నిర్వహించారు. ఈ ఘటన బీహార్‌లోని ఖగారియా జిల్లా అలౌలీ హీత్‌ హెల్త్‌ సెంటర్‌లో చోటుచేసుకుంది. 

బీహార్ లో గుండెలు పిండేసే ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. స్టెరిలైజేషన్ పేరుతో మహిళలను చిత్రహింసలకు గురి చేసి.. భయాందోళనలు కలిగించిన ఘటన బయటపడింది. మహిళల పట్ల జంతువుల కంటే దారుణంగా వ్యవహరించిన తీరు సమాజం తల దించుకునేలా చేస్తుంది. అనస్థీషియా (మత్తు) ఇవ్వకుండానే 23మంది మహిళలకు ట్యూబెక్టమీ ఆపరేషన్లు నిర్వహించిన ఘటన బీహార్‌లోని ఖగారియా జిల్లా అలౌలీ హీత్‌ హెల్త్‌ సెంటర్‌లో వెలుగులోకి వచ్చింది. 

ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో ట్యూబెక్టమీ నిర్వహించేందుకు 30 మంది మహిళలను ఖగారియా జిల్లా అలౌలీ హీత్‌ హెల్త్‌ సెంటర్‌ కు తీసుకవచ్చింది. మొదట 23 మందికి అనస్థీషియా (మత్తు) ఇవ్వకుండానే వైద్యులు ఆపరేషన్‌ చేశారు. వారి అరుపులు, కేకలు విన్న మిగితా ఏడుగురు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులకు సమాచారం అందించారు. హెల్త్‌ సెంటర్‌లోని ఆరోగ్య సిబ్బంది వారిని గట్టిగా పట్టుకోగా, వైద్యులు ట్యూబెక్టమీ నిర్వహించినట్టు బాధిత మహిళలు స్థానిక మీడియాకు తెలిపారు. బాధ భరించలేక ఏడుస్తూ..కేకలు పెట్టిన తమని పట్టించుకున్న వారు లేరని, జంతువుల కంటే హీనంగా చూశారని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై జిల్లా మెజిస్ట్రేట్‌ విచారణకు ఆదేశించారు.

సరైన విధంగా మత్తు ఇవ్వకుండా.. ఆపరేషన్ చేశారని పలు బాధిత మహిళలు చెబుతున్నారు. ఓ మహిళ బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ చేస్తున్న తీరును నిరసించానని, అయితే ఆపరేషన్ చేసిన వ్యక్తులు ఇలాగే జరుగుతుందని చెప్పారని అన్నారు. నొప్పి వస్తుందని చెప్పినా.. మత్తు మందు ఇవ్వకుండా ఆపరేషన్ చేశారనీ, తనకు నారలు లాగినట్లుగా నొప్పి వచ్చిందని ప్రతిఘటించినా.. ఫలితం లేకుండా పోయిందని బాధపడింది. తాను నొప్పితో అరుస్తూనే ఉన్నానని, కానీ ఎవరూ తన బాధను పట్టించుకోలేదని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. అలోలి ఆసుపత్రిలో ఉన్న మహిళలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆపరేషన్ సమయంలో చాలా మంది మహిళలు నొప్పితో విలపించారు. కానీ వారి మాట వినేవారు లేరు.ఆపరేషన్‌ చేసే సమయంలో వైద్యులు కూడా లేరని మహిళలు ఆరోపించారు. బలవంతంగా ఆపరేషన్‌ థియేటర్‌కి తీసుకెళ్లి ఆపరేషన్‌ చేశారు. వేసెక్టమీ సమయంలో మహిళలకు అనస్థీషియా ఇంజెక్షన్ ఇస్తారు. కానీ ఇది చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఘటనపై దర్యాప్తు

మరోవైపు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సివిల్‌ సర్జన్‌ అమర్‌కాంత్‌ ఝా తెలిపారు. ఇలా ఎందుకు జరిగింది? ఇందులో ఏ ఉద్యోగులు, వైద్యుల ప్రమేయం ఉందనేది నిర్ధారించి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. తమను నేలపై పడుకోబెట్టారని మహిళలు చెప్పారు. ఇంజెక్షన్ ఇవ్వలేదు. ఎలాంటి సౌకర్యం కల్పించలేదు. ఈ ఘటన తర్వాత బీహార్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.