పాట్నా: బీహార్‌లోని జహనాబాద్ జిల్లా ఠాగూర్ బారిలో శుక్రవారం నిర్వహించిన దసరా వేడుకల్లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. దుర్గా పూజ వేడుకలకు వెళ్లిన మహిళలపై ఓ అల్లరిమూక బ్లేడులతో విచక్షణా రహితంగా దాడిచేసింది. ఈ దాడులలో సుమారు 25 మంది మహిళలు గాయపడ్డారు. 

వివరాల్లోకి వెళ్తే ప్రతీ ఏడాది ఠాగూర్ బారి ప్రాంతంలో దసరా తిరునాళ్లు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ తిరునాళ్లలో ప్రజలు ఎంతో ఆసక్తిగా పాల్గొంటారు. దుర్గాదేవి అలంకారాలను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. తిరునాళ్లలో పెద్దఎత్తున భక్తులు చేరుకున్న సమయంలో ఓ అల్లరి మూక బ్లేడ్ లతో రెచ్చిపోయింది. సుమారు 25 మంది మహిళలపై బ్లేడ్ తో దాడి చేసింది. 

గాయపడిన 25 మంది మహిళలలో దాదాపు 20 నుంచి 30 ఏళ్ల లోపు మహిళలలే కావడం గమనార్హం. బ్లేడ్ బ్యాచ్ మహిళల నడుమ కింది భాగాన్నే టార్గెట్ గా చేసుకుని దాడికి పాల్పడింది. గాయపడిన మహిళలందరికీ నడుమ కింద భాగంలోనే గాయాలయ్యాయి. బ్లేడ్ బ్యాచ్ వీరంగంతో మహిళలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తిరునాళ్ల నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు హూటాహుటిని ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

బ్లేడ్ దాడితో మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా రక్తస్రావం అవడంతో పోలీసులు మహిళలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత మహిళలు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు జహనాబాద్ జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ ఘోష్, ఎస్పీ మనీష్ కుమార్ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.