బీహార్‌లో ఓ ద్విచక్ర వాహనదారుడు సీటు బెల్టు పెట్టుకోనందుకు విచిత్రమైన ట్రాఫిక్ చలాన్ అందుకున్నాడు. 2020లో ట్రాఫిక్ ఉల్లంఘన కారణంగా సమతిపూర్‌లో ఈ సంఘటన జరిగింది.
కారు నడిపే వ్యక్తికి సీటు బెల్డ్ పెట్టుకోలేదని చలానా రాస్తే..చల్తా..! కానీ, బైక్ నడిపే వ్యక్తికి సీటు బెల్డ్ పెట్టుకోలేదని చలానా రాస్తే…!? అసలు ఏమనుకోవాలి. అలా ఫైన్ వేసిన అధికారిని ఏవిధంగా అభివర్ణించాలి. ఒక్కటి మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతోంది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా..! అన్నట్టు ట్రాఫిక్ అధికారులు అనుకుంటే.. ఫైన్లు వేయడం కష్టమా!?.. చదవడానికి చాలా విడ్డూరంగా ఉన్న ఈ వింత సంఘటన బీహార్‌లోని సమతిపూర్‌లో వెలుగులోకి వచ్చింది. ఓ ద్విచక్ర వాహనదారుడు బైక్ నడుపుతూ సీటు బెల్టు పెట్టుకోలేదని చలానా పడింది.
బీహార్‌లో ఓ ద్విచక్ర వాహనదారుడు సీటు బెల్టు పెట్టుకోనందుకు విచిత్రమైన ట్రాఫిక్ చలాన్ అందుకున్నాడు. 2020లో ట్రాఫిక్ ఉల్లంఘన కారణంగా తనకు జరిమానా విధించినట్టు వాహనదారుడు కృష్ణకుమార్ ఝా తెలిపారు. కృష్ణకుమార్ ఝా మీడియాతో మాట్లాడుతూ.. "నా దగ్గర స్కూటీ ఉంది. ఏప్రిల్ 27న నేను బెనారస్ (వారణాసి) వెళుతున్నాను. నేను రైలులో ఉన్నప్పుడు, నా పేరుపై ₹ 1,000 చలాన్ జారీ చేయబడిందని నా ఫోన్ కు ఓ మెసేజ్ వచ్చింది. అందులో 2020 అక్టోబర్‌లో సీట్‌బెల్ట్ ధరించనందుకు.. ₹ 1,000 విధించినట్టు ఉంది. టూ వీలర్ నడిపితే సీట్‌బెల్ట్ చలానా రావడమేంటని ఆశ్చర్యపోయాను" అన్నారాయన.
అనంతరం ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించగా.. ఏదో ఒక లోపం కారణంగా తప్పుగా చలాన్ వచ్చినట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారట. ఈ అంశంపై బీహార్ ట్రాఫిక్ పోలీసు అధికారి బల్బీర్ దాస్ మాట్లాడుతూ.. "కృష్ణకుమార్ ఝా అందుకున్న చలాన్ మాన్యువల్‌గా జారీ చేయబడింది. ఇప్పుడు, మేము వీటన్నింటినీ ఈ-చలాన్‌లుగా అందిస్తున్నామనీ, లోపం ఎక్కడ జరిగిందో తనిఖీ చేస్తున్నామని తెలిపారు.
ఫిబ్రవరిలో ఒడిశాలో ఇదే తరహా సంఘటన చోటుచేసుకుంది. అభిషేక్ కర్ అనే టూ వీలర్స్ కు సీటుబెల్ట్ ధరించనందుకు ₹ 1,000 జరిమానా విధించారు. రాజ్‌గంగ్‌పూర్ నివాసి అయిన అభిషేక్ మాట్లాడుతూ.. ఇ-చలాన్‌లో ఉన్న ఫోటో మరొకరిదని తనకు తర్వాత తెలిసిందనీ, ఆ లోపం గురించి స్థానిక రవాణా అధికారులను , రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ అధికారులకు తెలియజేసినట్టు తెలిపారు.
