Asianet News TeluguAsianet News Telugu

యోగి ఆదిత్యనాథ్‌కు ఊరట: అఖిలేశ్‌ ఆశలు గల్లంతు.. యూపీ లోకల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకుని అందుకు తగ్గట్లుగా వ్యూహా రచన చేస్తున్న అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది

Big Win For BJP In UP Local Body Polls Setback For Akhilesh Yadav ksp
Author
Lucknow, First Published Jul 3, 2021, 8:04 PM IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకుని అందుకు తగ్గట్లుగా వ్యూహా రచన చేస్తున్న అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. జిల్లా పంచాయతీ ఛైర్‌పర్సన్ ఎన్నికల్లో 75 సీట్లకు గాను 67 చోట్ల కమలనాథులు విజయం సాధించారు. సమాజ్‌వాదీ పార్టీ కేవలం ఆరు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 

2016లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకంగా 63 సీట్లు సాధించి సమాజ్‌వాదీ పార్టీ రికార్డుల్లోకెక్కింది. తాజాగా బీజేపీ... ఈ రికార్డును బద్దలు కొట్టింది. ఏకంగా 67 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీలో కూడా బీజేపీ జెండా ఎగరేయడం విశేషం. యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న వేళ.. కాషాయ శిబిరంలో ఈ ఫలితాలు ఊపునిచ్చాయి.

ఈ ఫలితాలపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య స్పందిస్తూ... ‘‘వచ్చే ఎన్నికల్లోనూ అధికారం మనదే... మనస్ఫూర్తిగా అనుకోండి’’ అంటూ ట్వీట్ చేశారు. యోగి ఆదిత్యనాథ్ పాలనపై వ్యతిరేకతతో పాటు రాష్ట్ర బీజేపీలో  నేతల మధ్య కుమ్ములాటలపై కేంద్ర పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు ముఖ్యమంత్రి యోగికి పరీక్షగా మారాయి. ఈ పరిస్ధితుల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీకి ఘన విజయాన్ని సాధించి పెట్టడం ద్వారా ఆదిత్యనాథ్ అధిష్టానం దృష్టిలో మంచి మార్కులు వేయించుకున్నట్లేనని విశ్లేషకులు అంటున్నారు. 

కాగా, స్థానిక ఎన్నికల్లో బీజేపీ నేతలు పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడ్డారంటూ ప్రయాగ్ రాజ్‌లో సమాజ్‌వాదీ పార్టీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీకి దిగారు. అయితే దీనిని అడ్డుకున్న పోలీసులు.. ఎస్పీ కార్యకర్తలపై లాఠీఛార్జీ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో సుమారు 3,000 మంది పంచాయతీ సభ్యులు వున్నారు. వీరంతా రాష్ట్రంలోని 75 జిల్లా పంచాయతీ చైర్‌పర్సన్‌లను ఎన్నుకోనున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios