Asianet News TeluguAsianet News Telugu

బెంగళూరులో ఆక్రమణదారుల జాబితాలో విప్రో, ప్రెస్టీజ్‌.. ఇంకా చాలానే హై ప్రొఫైల్ సంస్థల పేర్లు..!

బెంగళూరు నగరం ముంపున‌కు గురికావ‌డానికి అనేక అక్ర‌మ‌ క‌ట్ట‌డాలేన‌ని మాట వినిపిస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేత డ్రైవ్‌ను ప్రభుత్వం కొనసాగిస్తుంది. అయితే ఆక్రమణదారుల జాబితాలో.. హై-ప్రొఫైల్ బిల్డర్లు, డెవలపర్లు, టెక్ పార్క్‌లు కూడా ఉన్నాయి. 

Big Names like Wipro Prestige Are on Bengaluru Encroachers list reports
Author
First Published Sep 14, 2022, 10:34 AM IST

బెంగళూరులో గత వారం భారీ వర్షాల కారణంగా న‌గ‌రం ముంపున‌కు గురైంది. అయితే న‌గ‌రం ముంపున‌కు గురికావ‌డానికి అనేక అక్ర‌మ‌ క‌ట్ట‌డాలేన‌ని మాట వినిపిస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేత డ్రైవ్‌ను ప్రభుత్వం కొనసాగిస్తుంది. అయితే వరదలకు దారితీసిన 700 నీటి కాలువలను మూసివేసిన ఆక్రమణదారుల జాబితాలో.. హై-ప్రొఫైల్ బిల్డర్లు, డెవలపర్లు, టెక్ పార్క్‌లు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో విప్రో, ప్రెస్టీజ్, ఎకో స్పేస్, బాగ్‌మనే టెక్ పార్క్, కొలంబియా ఏషియా హాస్పిటల్, దివ్యశ్రీ విల్లాస్ ఉన్నాయని తాము గుర్తించినట్టుగా ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది. సామాన్యులకు చెందిన అక్రమ కట్టడాల కూల్చివేతలు జోరుగా సాగుతున్నప్పటికీ.. హై ‌ప్రొఫైల్ కంపెనీలను ఇంకా టచ్ చేయలేదని కూడా తెలుస్తోంది. అయితే నివాస ప్రాంతంలో కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. అధికారిక సంఖ్య మాత్రం ఇంకా వెల్లడికాలేదు. 

ఇక, ఇందుకు సంబంధించి కొందరు ఇంజనీర్లు తమతో మాట్లాడినట్టుగా ఎన్‌డీటీవీ పేర్కొంది. అయితే పేరు చెప్పడానికి నిరాకరించిన వారు.. అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియలో ఎవరికి విడిచిపెట్టేది లేదని చెప్పారు. కానీ చర్యలు ఇంకా ప్రారంభం కాలేదని తెలిపారు. ‘‘మేము ఒకదాని తర్వాత ఒకటి కూల్చివేత ప్రక్రియ చేపడుతున్నాం. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే స్పష్టమైన ఆలస్యం ఉంది’’ అని ఇంజనీర్లలో ఒకరు చెప్పారు.

ఇదిలా ఉంటే.. తూర్పు బెంగళూరులోని నలపాడ్ అకాడమీ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో కూల్చివేత కార్యక్రమం చేపట్టారు. ఈ పాఠశాల కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ మహమ్మద్ నలపాడ్‌కు చెందినది. బెంగళూరులో వరదలపై అధికార బీజేపీపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకుడికి చెందిన స్కూల్ ప్రాంగణంలో కూల్చివేత జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇక, పాఠశాల ఆక్రమణలు దృష్టికి రాకుండా ఎలా పోయిందని కూల్చివేతలను పర్యవేక్షిస్తున్న చీఫ్ ఇంజినీర్ మాలతి అధికారులను ప్రశ్నించారు. ఈ విషయంలో రెవెన్యూ శాఖ తీరును తప్పుబట్టారు. ‘‘మాకు తెలియదు. ఇది రెవెన్యూ డిపార్ట్‌మెంట్ పరిధిలోకి వస్తుంది. వారు అడ్డు చెప్పాల్సింది. ఇప్పుడు మేము ఆక్రమణను కూల్చివేస్తున్నాము’’ మాలతి చెప్పారు. 

మరోవైపు బెంగళూరు తూర్పు ప్రాంతంలో ఓ నాలుగు అంతస్తుల భవనం సరిహద్దు గోడను అధికారులు కూల్చివేశారు. ఆ సమయంలో బిల్డింగ్‌లోని ఇళ్లలో నివాసితులు ఉన్నారు. అయితే ఆ భవన యజమాని దినేష్ రెడ్డి మాట్లాడుతూ.. నిర్మాణాన్ని ప్రారంభించే ముందు అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ చాలా కాలంగా ఉందని.. ఈ విషయం తెలిసినా అధికారులు భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చారని చెప్పారు. తాను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వచ్చి కాంపౌండ్ వాల్ కూల్చివేశారని తెలిపారు.

కూల్చివేతలను పర్యవేక్షిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ మునిరెడ్డి స్పందింస్తూ.. నిర్మాణానికి ఎటువంటి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఈ భవనానికి మంజూరైన ప్లాన్ లేదని.. చట్టాలను ఉల్లంఘించి స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ పై నిర్మించారని చెప్పారు. చాలా మంది నివాసితులు కూల్చివేత గురించి తమకు ముందస్తు నోటీసు ఇవ్వలేదని, కూల్చివేత జరుగుతున్నప్పుడే దాని గురించి తెలుసుకున్నామని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios