న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై రైతులను తప్పుదోవపట్టిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు.గుజరాత్ రాష్ట్రంలోని కచ్ లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన మంగళవారం నాడు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా రైతులతో ఆయన సమావేశమయ్యారు.

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాల విషయంలో అన్నదాతలను విపక్షాలు తప్పుదోవపట్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

కొత్త చట్టాలు అమలైతే రైతుల భూములు లాక్కొంటారని అన్నదాతలను భయపెడుతున్నారన్నారు. పాలు అమ్ముతున్నారని డైరీ యజమాని మీ పశువులను తీసుకెళ్తారా అని ఆయన ప్రశ్నించారు.

విపక్షపార్టీలు ఈ సంస్కరణలకు గతంలో అనకూలంగా ఉన్నాయన్నారు. కానీ ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేకపోయాయన్నారు.  తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్ తో ఢిల్లీ సరిహద్దుల్లో 16 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.పలు దఫాలుగా కేంద్ర మంత్రులు రైతు సంఘాల నేతలతో చర్చంచారు. అయినా రైతు సంఘాల నేతలు మాత్రం వెనక్కు తగ్గలేదు.కొత్త చట్టాలను రద్దు చేసేవరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు తేల్చి చెప్పారు.