Asianet News TeluguAsianet News Telugu

UP Election 2022: యూపీ పోరులో కాంగ్రెస్ "న‌వఅవతారం"

UP Election 2022:  యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ కొత్త అవతారంలో బరిలోకి దిగనుంది. గెలుపే ధ్యేయంగా అభ్యర్థుల ఎంపికలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. యువతకు, కొత్తవారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు దఫాలుగా ప్రకటించిన మొత్తం 166 మంది అభ్యర్థులలో 119 మంది పూర్తిగా కొత్తవారే కావడం విశేషం.
 

Bid to present 'new avatar', Congress fields 70 per cent fresh faces in UP polls
Author
Hyderabad, First Published Jan 23, 2022, 2:32 PM IST

UP Election 2022: ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ర‌స‌వ‌త్తరంగా మారుతోన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో వూహ్య, ప్రతి వూహ్యలతో రాజకీయం మరింత రంజుగా మారింది. ఈ త‌రుణంలో కాంగ్రెస్ న‌వ‌ అవతారంలో ఎన్నిక‌ల‌ బరిలోకి దిగనుంది. గెలుపే ధ్యేయంగా.. అధికార‌మే ల‌క్ష్యంగా అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా. ఈ సారి.. పాత వారిని ప‌క్క‌న పెట్టి.. యువతకు, కొత్తవారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఈ క్రమంలో యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు దఫాలుగా ప్రకటించిన మొత్తం 166 మంది దాదాపు 70 శాతం కొత్త‌వారినే రంగంలో దించింది. అంటే.. అభ్యర్థులలో 119 మంది పూర్తిగా కొత్తవారే కావడం విశేషం. అలాగే, వాగ్దానం మేర‌కు దాదాపు 40 శాతం మహిళా అభ్యర్థులను పోరులో నిలిపింది. 

గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కేవ‌లం 7 సీట్లను మాత్ర‌మే గెలుచుకుంది. రెండు సీట్లలో విజేతలు భాజపాలోకి ఫిరాయించారు. చాలా ఏళ్ల క్రితమే యూపీని చేజార్చుకున్న కాంగ్రెస్‌ పార్టీ.. వ‌రుస ప‌రాజయాల‌తో కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా... అధికారంలోని నిలపాలని ప్రియాంక  గాంధీ తీవ్రంగా ప్రయత్నించారు.

 ఈ త‌రుణంలో మహిళలు, యువకులు, రైతులు, వెనుకబడిన కులాలు, దళితుల సమస్యలపై పోరాడుతున్న వారికి కాంగ్రెస్‌ అగ్రస్థానం ఇవ్వాల‌ని ప్రియాంక గాంధీ ప్రయత్నం చేశారని పార్టీ ప్రతినిధి అన్షు అవస్థి చెప్పారు.ఏళ్ల తరబడి కుల, మత రాజకీయాలతో సతమతమవుతున్న రాష్ట్ర రాజకీయాలకు కొత్త దిశానిర్దేశం చేసేందుకు పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు అభ్యర్థుల జాబితా స్పష్టమైన దర్శనం ఇస్తోందని అన్నారు. అలాగే.. యువతకు, ఆయా రంగాల్లో కృషి చేస్తున్న వారికి పార్టీ టిక్కెట్లు ఇచ్చామని, ప్ర‌క‌టించిన  125 మంది అభ్య‌ర్థుల్లో 26 మంది అభ్యర్థులు 35 ఏళ్లలోపు ఉన్నవారేనని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి తెలిపారు.

ఈ క్ర‌మంలో ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తల్లి ఆశాసింగ్‌(55)కు, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఉద్యమించిన సదాఫ్‌ జాఫర్, ఆశా కార్యకర్తల కోసం పోరాడి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ సభలో భౌతిక దాడికి గురైన పూనం పాండే, ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన రామ్‌ రాజ్‌ గోండ్‌ కాంగ్రెస్‌ టికెట్‌పై తొలిసారి అసెంబ్లీకి పోటీచేస్తున్నారు.  

అదేవిధంగా, హాపూర్‌కు చెందిన సామాజిక కార్యకర్త భావన వాల్మీకి, చార్తావాల్ నుండి యాస్మిన్ రానా, ఠాకూర్‌ద్వారా నుండి సల్మా అఘా అన్సారీ, బిలారి నుండి కల్పనా సింగ్, మీరట్ సౌత్ నుండి నఫీస్ సైఫీ, సహరాన్‌పూర్‌ నుంచి సుఖ్‌విందర్‌ కౌర్‌ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయనున్నారు.

 ఎన్నిక‌ల బ‌రిలో కొత్త ముఖాలను రంగంలోకి దింపడం వల్ల పార్టీకి నూత‌న ఉత్తేజాలు చేకూరుతాయ‌ని,   చాలా కాలంగా వేధిస్తున్న అంతర్గత తగాదాలను కూడా అధిగమించవచ్చని భావిస్తోన్నారు. తొలి జాబితా ఉత్తరప్రదేశ్‌లో న్యాయం కోసం పోరాడిన అభ్యర్థులను పార్టీ ఎంపిక చేసిందని, వారు ముందంజలో రావాలని, రాష్ట్రంలో అధికారంలో భాగం కావాలని పార్టీ కోరుకుంటుందని పేర్కొన్నారు.
అలాగే.. ఉత్తరప్రదేశ్‌లో పార్టీ ప్ర‌తినిధిగా (ముఖం) తానే ఉంటానని స్పష్టం చేసిన ప్రియాంక గాంధీ, పార్టీ కోల్పోయిన వైభవాన్ని తిరిగి తీసుక‌రావడంలో  ఎంతటి కష్టమైన పనిని ఎదుర్కొంట‌న‌ని తెలిపారు.

ఎన్నిక‌ల్లో యువ‌త‌కు ప్ర‌ధాన్యత ఇచ్చే.. ఉద్దేశంతో గత ప్రభుత్వాల లోటుపాట్ల‌ను ఎత్తిచూప‌డానికి యువ‌త కోసం.. కాంగ్రెస్ పార్టీ ఆదివారం "స్పీక్ అప్" ప్రచారాన్ని ప్రారంభించనుంది.యువ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డానికి ఎన్నికల మేనిఫెస్టో "భారతీ విధాన్" విడుదలైన రెండు రోజుల తర్వాత సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పార్టీ రాష్ట్ర విభాగం నవల ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని ఇన్‌చార్జి నసీముద్దీన్ సిద్ధిఖీ తెలిపారు.  

"స్పీక్ యుపి" ప్రచారంలో, యువకులు "భారతీ విధాన్" పై తమ "విశ్వాసాన్ని సోష‌ల్ మీడియాలో  పంచుకుంటారని, అలాగే ప్రస్తుత యోగి ఆదిత్యనాథ్‌తో సహా రాష్ట్ర ప్రభుత్వాల వైఫ‌ల్యాల‌ను,  అనుభవాలను కూడా వివరిస్తారని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఏడు కోట్ల మంది యువత ఆశలు, ఆకాంక్షల పత్రం భారతీ విధానమని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే  20 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు.   అలాగే.. తృటిలో ఓట‌మి పాలైన నియోజ‌క వ‌ర్గాల‌పై కూడా కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టింది.

ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభలో మొత్తం 403 సీట్లు ఉన్నాయి. వాటిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 5,000 ఓట్ల కన్నా తక్కువ మెజారిటీతో అభ్యర్థులు గెలిచిన 47 నియోజకవర్గాలపై ఈసారి అన్ని పార్టీలూ దృష్టి సారించింది.  వీటిలో 23 స్థానాలను భారతీయ జనతా పార్టీ, 13 స్థానాలను సమాజ్‌వాదీ పార్టీ, 8 సీట్లను బహుజన్‌ సమాజ్‌ పార్టీ కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్, అప్నాదళ్, రాష్ట్రీయ లోక్‌ దళ్‌ పార్టీలు ఒక్కొక్కటి చొప్పున గెలిచాయి. ఈసారి బలమైన అభ్యర్థులను నిలబెట్టి గట్టి ప్రయత్నం చేస్తే ఈ 47 సీట్లలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లను గెలుచుకోవచ్చని ఆయా పార్టీలు భావిస్తున్నాయి

Follow Us:
Download App:
  • android
  • ios