Asianet News TeluguAsianet News Telugu

బీజేపీకి ఒడిశా మాజీ సీఎం గిరిధ‌ర్ గ‌మాంగ్ రాజీనామా.. త్వ‌ర‌లో బీఆర్ఎస్ లోకి.. !

Bhubaneswar: ఒడిశా మాజీ ముఖ్య‌మంత్రి, భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు గిరిధర్ గమాంగ్, ఆయ‌న కుమారుడు శిశిర్ గమాంగ్ లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.  బీజేపీని వీడిన వారిద్ద‌రూ త్వ‌ర‌లోనే తెలంగాణ ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖర్ రావు (కేసీఆర్) సార‌థ్యంలోని భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) లో చేరే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం. 
 

Bhubaneswar : Former Odisha CM Giridhar Gamang resigns from BJP; Soon joins BRS
Author
First Published Jan 25, 2023, 4:39 PM IST

Former Odisha Chief Minister Giridhar Gamang: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ)కి గుడ్ బై చెప్పారు. ఆయ‌న బీజేపీలో అనేక అవ‌మానాలు ఎదుర్కొన్నాని ఆరోపిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే, త‌న‌కు ఇంత‌కాలం మ‌ద్ద‌తుగా నిలిచిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

వివ‌రాల్లోకెళ్తే..  తనకు పార్టీలో అవమానాలు ఎదురయ్యాయని ఆరోపిస్తూ ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ బీజేపీ రాజీనామా చేశారు. ఆయ‌న కుమారుడు శిశిర్ గమాంగ్ కూడా బీజేపీకి గుడ్ బై చెప్పారు. బీజేపీని వీడిన వారిద్ద‌రూ త్వ‌ర‌లోనే తెలంగాణ ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖర్ రావు (కేసీఆర్) సార‌థ్యంలోని భార‌త రాష్ట్ర స‌మితిలో చేరే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం. రాజ‌కీయ అనుభవజ్ఞుడైన గిరిజన నాయకుడుగా ఆయ‌న‌కు గుర్తింపు ఉంది. ఆయ‌న కుమారుడు కూడా బీజేపీని వీడారు. బీజేపీ త‌న‌కు పార్టీలో సరైన ప్రాముఖ్యత ఇవ్వలేదని గ‌మాంగ్ అన్నారు. 

తండ్రీకొడుకులు భువనేశ్వర్‌లో ఏర్పాటుచేసిన‌ ప్రెస్‌మీట్ లో మాట్లాడుతూ.. అవమానాన్ని సహించలేమని అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. పార్టీలో, కోరాపుట్ లో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని, ఇక్కడి నుంచి తాను తొమ్మిదిసార్లు లోక్ సభకు ఎన్నికయ్యానని గిరిధర్ గమాండ్ చెప్పారు. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డాకు పంపినట్లు వెల్ల‌డించారు. 2015లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు.

2015లో ఎలాంటి షరతులు లేకుండా ఇష్టానుసారంగా బీజేపీలో చేరాన‌ని చెప్పారు. ఒడిశా ప్రజల కోసం రాజకీయ, సామాజిక, నైతిక కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోతున్నానని గ్రహించానని, అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని గమాంగ్ లేఖలో పేర్కొన్నారు. 1999లో తాను ఓటు వేయడంపై పార్లమెంటులో స్పష్టత ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, అప్పటి పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీని వీడాలన్న తన నిర్ణయం వెనుక కారణాలను ప్రస్తావిస్తూ గిరిధర్ గమగ్ మాట్లాడుతూ.. రోడ్డున అవమానం సహించదగినదే కానీ రాజకీయాల్లోఅవమానం కాదన్నారు. అవమానాన్ని నేనెప్పుడూ సహించలేదనీ, అలాగే, ముందుకు సాగుతాన‌ని అన్నారు. 

2015 లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన త‌న‌ను, త‌న కుమారుడు శిశిర్ గ‌మాంగ్ ను ఉద్దేశపూర్వకంగా అవమానించిన సందర్భాలు చాలా ఉన్నాయ‌ని ఆరోపించారు. బరువెక్కిన హృదయంతో బీజేపీకి రాజీనామా చేస్తున్నాని తెలిపారు. త్వరలోనే మ‌రో జాతీయ పార్టీలో చేరుతానని, తనకు ఏ పని అప్పగించినా అంకితభావంతో నిర్వహిస్తానని గిరిధర్ గమాంగ్ చెప్పారు. అయితే, ఆయ‌న వ్యాఖ్య‌లు సూత్ర‌ప్రాయంగా కేసీఆర్ నాయ‌క‌త్వంలోని బీఆర్ఎస్ లో చేరిక‌ను సూచిస్తున్నాయి. 

కావాలనే తమను పార్టీలో పక్కన పెట్టారనీ, కార్యకలాపాలు, సమావేశాల గురించి ఆలస్యంగా సమాచారం ఇచ్చారని గిరిధర్ కుమారుడు శిశిర్ అన్నారు. త‌న‌కు ఎంపీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు కానీ ఆ తర్వాత గుణుపూర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని తెలిపారు. అయితే, క్షేత్రస్థాయిలో బీజేపీ నేతల నుంచి త‌న‌కు మ‌ద్ద‌తు లభించలేదని పేర్కొన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు అంశాలను లేవనెత్తినా క్షేత్రస్థాయిలో పార్టీ మెరుగైన పనితీరు కోసం తమ సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని శిశిర్ ఆరోపించారు.

గిరిధర్ గమాంగ్, ఆయన కుమారుడు ఇద్దరూ ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసిన నేపథ్యంలో వారు భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరుతారనే ఊహాగానాలకు ఆజ్యం పోసిన విషయం తెలిసిందే. కోరాపుట్ మాజీ శాసనసభ్యుడు జయరాం పాంగి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు రాజకీయ పార్టీ భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) లో చేరుతున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ నెల 27న హైదరాబాద్ లోని బీఆర్ఎస్ లో ఆయ‌న చేరనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios