కోల్ కతాలో దారుణం జరిగింది. ఓ జంట తమ సొంత అపార్ట్ మెంట్లోనే హత్యకు గురయ్యింది. అయితే హత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. 

కోల్‌కతా : దక్షిణ కోల్‌కతాలోని భవానీపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. 50 ఏళ్ల జంట సోమవారం సాయంత్రం తమ అపార్ట్ మెంట్ లో దారుణంగా హత్యకు గురైంది. ఈ ఘటన దక్షిణ కోల్‌కతాలోని భవానీపూర్‌లో హరీష్ ముఖర్జీ రోడ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ గ్రౌండ్ ఫ్లోర్ లో జరిగింది. ఘటన అనంతరం వచ్చిన దర్యాప్తు బృందం ప్రాధమిక విచారణలో.. మృతి చెందిన దంపతులు - అసోకే జే షా (56), అతని భార్య రష్మిత (52)గా గుర్తించారు. ఇంట్లో దోపిడిని అడ్డుకునే క్రమంలో దంపతుల హత్య జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. 

ఇంట్లోని నగదు, బంగారం కనిపించడం లేదు. అల్మిరా, లాకర్ పగలగొట్టి ఉన్నాయి. అయితే ఈ హత్యలు కేవలం దొంగతనంలో భాగంగానే జరిగాయా.. లేదా అనేకోణాల్లోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుల శరీరంపై అనేక గాయాలు ఉన్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. నిందితులు ఒకరికంటే ఎక్కువ మంది ఉండొచ్చని, వీరికి తెలిసినవారే అయి ఉంటారని కూడా అనుమానిస్తున్నారు. ఈ కోణంలో కూడా వారు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ దంపతులు పెళ్లికాని చిన్న కూతురుతో కలిపి అపార్ట్‌మెంట్‌లో ఉన్నారు. వారికి ఇంకా ఇద్దరు పెద్ద కుమార్తెలు ఉన్నారు. వారిద్దరికీ వివాహాలయ్యాయి. వేరే చోట ఉంటారు. చిన్న కూతురే తల్లిదండ్రులు చనిపోయిన సంగతి మొదట గుర్తించింది. ఆమె ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లింది. సాయంత్రం ఫోన్ చేస్తుంటే తల్లిదండ్రులు రిఫ్లై ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వచ్చి చూసే సరికి దారుణం జరిగిపోయింది. 

హత్య విషయం తెలిసి అక్కడికి వచ్చిన స్థానిక కౌన్సిలర్ కజారి బెనర్జీ మాట్లాడుతూ... ఈ దంపతులు 73B హరీష్ ముఖర్జీ రోడ్‌లో చాలా కాలంగా నివసిస్తున్నారని చెప్పారు. అశోక్ స్టాక్-మార్కెట్ పని చేస్తాడని, ఐదు సంవత్సరాల క్రితం అతను తన టార్చ్-తయారీ, విక్రయాల వ్యాపారాన్ని తగ్గించినప్పటి నుండి అతని ప్రధాన ఆదాయ వనరు అదేనని తెలిపారు. 

హంతకులు అల్మెరా, లాకర్‌ లను పగలగొట్టారు. గ్రౌండ్ ఫ్లోర్ లోని అపార్ట్ మెంట్ మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఇంట్లోని ప్రతీ చిన్నదాన్నీ దోచుకున్నారని దర్యాప్తు బృందానికి సన్నిహిత వర్గాలు తెలిపాయి. దంపతులు ఎప్పుడూ ధరించే అనేక ఉంగరాలు, నెక్లెస్‌లు కనిపించడం లేదని బాధితురాలి బంధువులు చెప్పుకొచ్చారు. వారు ముట్టుకోనిదల్లా.. డైనింగ్ టేబుల్‌పై ఉన్న ఆహారం, టెలివిజన్ సెట్‌ లు మాత్రమే. చిన్న కూతురు ఇంటికి వచ్చి, తల్లిదండ్రుల మృతదేహాలను కనుగొనేవరకూ టీవీ నడుస్తూనే ఉంది. ఇప్పటివరకు లభించిన ఆధారాలు, సాక్ష్యాల ప్రకారం ఇది.. "లాభం కోసం హత్య"గా పరిగణించబడుతుందని పోలీసులు చెప్పారు.