వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం.. బ్యాటరీ బాక్స్‌లో చెలరేగిన మంటలు..
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్‌లో మంటల చెలరేగాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.

న్యూఢిల్లీ: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్‌లో మంటల చెలరేగాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 5.40 గంటలకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి బయలుదేరి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్‌కు మధ్యాహ్నం 1.10 గంటలకు చేరుకోవాల్సి ఉంది. అయితే రైలు మధ్యప్రదేశ్‌లోని కుర్వాయి కేథోరా రైల్వే స్టేషన్‌కు చేరుకున్న సమయంలో ఒక కోచ్‌లోని బాక్స్‌లో మంటలు చెలరేగాయి. దీంతో కుర్వాయి కేథోరా స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. అగ్నిమాపక దళ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి రప్పించి ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీశారు.
‘‘కుర్వాయి కేథోరా స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కోచ్‌లోని బ్యాటరీ బాక్స్‌లో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పింది’’ అని రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే తెలిపింది. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని చెప్పింది. మంటలు బ్యాటరీ బాక్స్‌కు మాత్రమే పరిమితం చేయబడ్డాయని పేర్కొంది. టెస్టింగ్ తర్వాత రైలు త్వరలో బయలుదేరుతుందని వెల్లడించింది.
ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకురాగా.. అందులో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కోచ్‌లో మంటలు కనిపించగా, కొంతమంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించారు.