Bhopal: శివరాత్రి సందర్భంగా మధ్యప్రదేశ్ లో కులం పేరుతో కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో 14 మందికి గాయాలు అయ్యాయి. సనావాడ్ ప్రాంతంలోని చాప్రా గ్రామంలో మూడు వర్గాలకు చెందిన ప్రజలు నిర్మించిన శివాలయంలో దళితులు ప్రార్థనలు చేయడంపై జరిగిన వాగ్వాదం భౌతిక ఘర్షణగా దారితీసిందని పోలీసులు తెలిపారు.
Caste Clashes In Madhya Pradesh: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పూజలు నిర్వహిస్తున్న సమయంలో ఒక శివాలయం వద్ద కులం పేరుతో ఘర్షణలు చెలరేగాయి. మూడు వర్గాల మధ్య మొదలైన వాగ్వాదం చివరకు ఘర్షణలకు దారితీసింది. ఒకరినొకరు కొట్టుకోవడంతో 14 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
వివరాల్లోకెళ్తే.. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒక వర్గానికి చెందిన ప్రజలు ప్రార్థనలు చేయడంపై తలెత్తిన వివాదం నైరుతి మధ్యప్రదేశ్ లో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో 14 మంది గాయపడ్డారు. ఖార్గోన్ జిల్లాలోని ఓ ఆలయంలోకి ప్రవేశించకుండా అగ్రవర్ణానికి చెందిన కొందరు తమను అడ్డుకున్నారని దళిత సామాజిక వర్గానికి చెందిన వారు ఆరోపించారు. సనావాడ్ ప్రాంతంలోని చాప్రా గ్రామంలో మూడు వర్గాలకు చెందిన ప్రజలు నిర్మించిన శివాలయంలో దళితులు ప్రార్థనలు చేయడంపై జరిగిన వాగ్వాదం భౌతిక ఘర్షణగా దారితీసిందని పోలీసులు తెలిపారు.
రాష్ట్ర రాజధాని భోపాల్ కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో చెలరేగిన హింసలో ఇరువైపులకు చెందిన వారు విచక్షణారహితంగా రాళ్లు రువ్వుకున్నారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. "ఇరువైపుల నుంచి భారీగా రాళ్లు రువ్వారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు అందాయి. కేసు నమోదుచేసుకున్నాం. ఈ ఘర్షణలపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం" అని సీనియర్ పోలీసు అధికారి వినోద్ దీక్షిత్ తెలిపారు. గుర్జార్ సామాజిక వర్గానికి చెందిన భయ్యా లాల్ పటేల్ నేతృత్వంలోని బృందం దళిత బాలికలను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నట్లు దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రేమ్ లాల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలను రక్షించడానికి సంబంధించిన చట్టంతో పాటు అల్లర్లు, ఇతర అభియోగాల కింద పోలీసులు 17 మంది అనుమానితులు, 25 మంది గుర్తుతెలియని నిందితులపై కేసు నమోదుచేశారు. రవీంద్రరావు మరాఠా ఫిర్యాదు మేరకు ప్రేమ్లాల్ తో పాటు మరో 33 మందిపై ఆయుధాలతో దాడి చేసినందుకు కౌంటర్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు, రెవెన్యూ అధికారుల బృందం గ్రామాన్ని సందర్శించింది. ఆలయంలోకి ప్రవేశించకుండా ఏ కులాన్ని అడ్డుకోలేమని ఇరువర్గాలకు వివరించామని దీక్షిత్ తెలిపారు. కొందరు పవిత్రంగా భావించే మర్రిచెట్టును నరికివేయడం, రాజ్యాంగ నిర్మాత, దళిత ఐకాన్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై గత కొన్ని రోజులుగా గ్రామంలో వివాదం నడుస్తోందని సమాచారం.
చెట్టును నరికివేయడంపై దళిత వర్గానికి చెందిన ఆరుగురిపై గుర్జార్లు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఒక చెట్టును నరికివేసేన ఘటనకు సంబంధించిన సమస్య కూడా ఉందనీ, అనుమతి లేకుండా చెట్లను నరికివేయడానికి వీల్లేదని వివరించారు. అదే రోజు పొరుగున ఉన్న కస్రావాడ్ ప్రాంతంలో జరిగిన మరో సంఘటనలో, చోటి కస్రావాడ్ గ్రామంలోని శివాలయంలో ప్రార్థనలు చేయకుండా తమను అడ్డుకున్నారని ఒక వర్గానికి చెందిన సభ్యులు ఆరోపించారు. శివలింగ అభిషేకానికి నీళ్లు ఇచ్చినందుకు తమను కులం పేరుతో దూషించారనీ, మహిళలు తోసేశారని మంజు బాయి అనే మహిళ ఆరోపించారు. కులవివక్ష చట్టం కింద అభియోగాలతో సహా ఐదుగురి పేర్లను కేసులో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.
ఛోటి కస్రావాడ్ లో మహా శివరాత్రి కారణంగా ఆలయం రద్దీగా ఉందని, ఈ కారణంగా మహిళల మధ్య వివాదం తలెత్తిందని చెప్పారు. ఒక వైపు ఐదుగురిపై కేసు నమోదైందనీ, నిందితుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి మనోహర్ సింగ్ గావ్లీ తెలిపారు.
