Madhya Pradesh: భోపాల్ లోని మదర్ ఇండియా కాలనీలోని క్లోరిన్ ట్యాంక్‌లో లీకేజీ ఘటనపై సమీక్షించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చామని మధ్యప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వస్ కైలాష్ సారంగ్ తెలిపారు. 

Chlorine Gas Leak In Bhopal: మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో గ్యాస్ లీకేజీ క‌ల‌క‌లం రేపింది. రాష్ట్ర రాజ‌ధాని ప్రాంతంలోని ఒక కాల‌నీలో క్లోరిన్ గ్యాస్ లీకేజీ కార‌ణంగా ప‌దుల మంది ఆస్ప‌త్రిపాల‌య్యారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ద‌ని సంబంధిత అధికారులు వెల్ల‌డించారు. వివ‌రాల్లోకెళ్తే.. భోపాల్‌లోని మదర్‌ ఇండియా కాలనీలోని వాటర్‌ ఫిల్టర్‌ ప్లాంట్‌ నుంచి బుధవారం సాయంత్రం క్లోరిన్‌ గ్యాస్‌ లీక్‌ కావడం కలకలం రేపింది. దీంతో ఆ ప్రాంతంలో నివసించే వారి కళ్లలో మంటలు మొదలయ్యాయి. అలాగే, చాలా మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ప‌డ్డారు. మీడియా రిపోర్టుల ప్ర‌కారం.. క్లోరిన్ గ్యాస్ లీకేజీ కార‌ణంగా ప్ర‌భావిత‌మైన వారి సంఖ్య అధికంగా ఉంద‌నీ, వారిలో 11 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నార‌ని స‌మాచారం. ఆస్పత్రిలో చేరిన వారి పరిస్థితి ప్ర‌స్తుతం మెరుగ్గా ఉందని మధ్యప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వస్ కైలాష్ సారంగ్ తెలిపారు. 

క్లోరిన్ గ్యాస్ లీక్ కావడంతో అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుందని భోపాల్ కలెక్టర్ అవినాష్ లావానియా తెలిపారు. ముగ్గురు రోగులను అంబులెన్స్‌లో హమీడియా ఆసుపత్రికి తరలించారు. హమీడియా ఆస్పత్రికి తరలించిన వారిలో 35 ఏళ్ల సంగీత, 40 ఏళ్ల పుష్ప, 65 ఏళ్ల పర్వేజ్ ఉన్నారు. ముగ్గురి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు సమాచారం. హమీడియా ఆసుపత్రిలో చేరిన వారి ఆరోగ్యం నిరంతరం మెరుగుపడిందని మధ్యప్రదేశ్ వైద్య విద్య మంత్రి విశ్వస్ కైలాష్ సారంగ్ ట్వీట్‌లో తెలిపారు. వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యం తగు చికిత్స అందించడంలో నిమగ్నమై ఉందని తెలిపారు. "మదర్ ఇండియా కాలనీ, ఈద్గా హిల్స్‌లో క్లోరిన్ ట్యాంక్ లీకేజీ కారణంగా ప్రభావిత‌మైన వారిని క‌లుసుకున్నాను.. హమీదియా ఆసుపత్రికి చేరుకుని వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాను. వారి ఆరోగ్యంలో నిరంతర మెరుగుదల ఉంది. సరైన వైద్యం అందించేందుకు వైద్యులు, ఆస్పత్రి యాజమాన్యం తీవ్రంగా శ్రమిస్తున్నారు" అని ఆయ‌న ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…

"ఈద్గా హిల్స్‌లోని మదర్‌ ఇండియా కాలనీలో క్లోరిన్‌ ట్యాంక్‌ లీకేజీ ఘటనపై సమీక్షించి, సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశాలు అందాయి. విచారణ అనంతరం దోషులుగా తేలిన వారెవరూ తప్పించుకోరు. అది పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటాం" అని మంత్రి మరో ట్వీట్‌లో రాశారు.

Scroll to load tweet…