మధ్యప్రదేశ్ లోని భోపాల్ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ సొంతపార్టీ కార్యకర్తలపై అలిగారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్ తో పాటు ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కూడా హాజరయ్యారు. 

పార్టీ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వేదికమీద చివరి వైపు కుర్చీని ప్రగ్యా ఠాకూర్ కు కేటాయించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ... కార్యక్రమం మధ్యలోనే ఆమె వెళ్లిపోయారు. 

ఇలా చివరి వరుసలో కుర్చీ కేటాయించడంపై ఆమె స్థానిక నాయకత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్థానిక నేతలు ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా సరే ప్రగ్యా ఠాకూర్ వినిపించుకోకుండా కార్యక్రమం మధ్యలోంచే నిష్క్రమించారు. అయితే దీనికి సంబంధించిన వ్యాఖ్యలను ఆమె మరో కార్యక్రమం వేదికగా పరోక్షంగా ప్రస్తావించారు. 

‘‘అసంపూర్తిగా మాట్లాడటం అసంపూర్ణ వ్యక్తిత్వం. ఇంతకంటే వివరించాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకున్నవారు సరైన వారు. అర్థం చేసుకోని వారు అమాయకులు. ఇప్పటి వరకు మనం కుర్చీలాటలో చిక్కుకోలేదు. ఇప్పుడు ఆ ఆటలో మనం చిక్కుకున్నాం.’’ అని ప్రగ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.