Bhiwandi Building Collapse: భివాండీలో శనివారం భవనం కూలిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 12 మందిని విపత్తు నిర్వహణ బృందాలు రక్షించాయి. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
Bhiwandi building collapse: మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండి ప్రాంతంలో భవనం కూలి ఐదేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. శిథిలాల నుంచి 12 మందిని రక్షించారు. మృతులను నవనాథ్ సావంత్ (40), లక్ష్మీదేవి రవి మటో (26), సోనా ముఖేష్ కోరి (5) అనే ఐదేళ్ల బాలికగా గుర్తించారు.
వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండిలోని వర్ధమాన్ కాంపౌండ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో గ్రౌండ్ ప్లస్ మూడంతస్తుల భవనం కూలిపోవడంతో కింది అంతస్తులో పనిచేస్తున్న కార్మికులు, రెండో అంతస్తులో నివసిస్తున్న కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి. ఘటన జరిగిన సమయంలో భవనంలో సుమారు 22 మంది చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్ర మంత్రి కపిల్ పాటిల్, థానే కలెక్టర్ అశోక్ సింగరే, అసిస్టెంట్ కమిషనర్ (భివాండి మున్సిపల్ కార్పొరేషన్) సంఘటనా స్థలంలో ఉన్నారు. థానే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది సహాయంతో స్థానికులను రక్షించి చికిత్స కోసం భివాండి ప్రభుత్వ ఉపాజిలా ఆసుపత్రికి తరలించారు. థానే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది ద్వారా ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం..
భీవండి భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరిందని థానే మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే, క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. పోలీసులు, అగ్నిమాపక దళం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), ఇతర రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను సక్రమంగా నిర్వహించాలని, క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రులకు తరలించి చికిత్స ప్రారంభించాలని సీఎం యంత్రాంగాన్ని ఆదేశించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని థానే మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.
