రైతులతో చర్చల విషయంలో ప్రధాన మంత్రి ప్రతిపాదనలను గౌరవిస్తామని అదే సమయంలో రైతుల ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటామని రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ స్పష్టం చేశారు.

ఆందోళన సందర్భంగా భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్న రైతుల్ని వెంటనే విడుదల చేసి చర్చలకు సామరస్య వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు.

సాగు చట్టాలకు ఉద్యమిస్తున్న రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు ఫోన్ కాల్ దూరంలో వున్నామని ప్రధాన మంత్రి ప్రకటించిన నేపథ్యంలో రైతు సంఘం నాయకులు ఈ విధంగా స్పందించారు.

కేంద్ర ప్రభుత్వం లేదా పార్లమెంట్ తమకు నమస్కరించాలని రైతులు కోరుకోవడం లేదని ప్రధాన మంత్రి ఉన్నతిని ఆయన చెప్పిన మాటలను తప్పకుండా గౌరవిస్తామని రాకేశ్ అన్నారు.

Also Read:త్రివర్ణ పతాకానికి అవమానం బాధించింది: మన్‌కీ బాత్ లో ప్రధాని మోడీ

జనవరి 26న జరిగిన ఘటనలు కుట్రలో భాగమేనన్న ఆయన దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందేనని డిమాండ్ చేశారు. జాతీయ పతాకం అన్నింటికంటే ఉన్నతమైనదని పతాకానికి అవమానం కలిగించిన వారిని ఎవరిని సహించేది లేదని రాకేశ్ స్పష్టం చేశారు.

ఈ విషయంలో గౌరవ ప్రదమైన నిర్ణయం రావాల్సి వుందన్న ఆయన.. ఒత్తిడి వాతావరణంలో చేసే ఎలాంటి నిర్ణయాలను తాము అంగీకరించబోమని తేల్చి చెప్పారు. శాంతియుత వాతావరణంలో కల్పించడంలో భాగంగా రైతు సంఘం నాయకులు విడుదల చేయాలన్నారు.

మరోవైపు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రం చేస్తున్నారు రైతులు. పంజాబ్, యూపీ, హర్యానా, ఉత్తరాఖండ్ నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ఢిల్లీ తరలివస్తున్నారు. ఘాజీపూర్, సింఘు, టిక్రీ వద్దకు వాహనాల్లో చేరుకుంటున్నారు.