Chhattisgarh: వచ్చే ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేప‌థ్యంలోనే బీజేపీ ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించింది. ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ నేతలు ఢిల్లీలో క‌మ‌ళం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. పార్టీ భవిష్యత్తు వ్యూహంపై సమావేశంలో చర్చ జరిగింది. 

BJP chief JP Nadda: వ‌చ్చే ఏడాది దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ఆయా రాష్ట్రాల ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా ఇప్పిటి నుంచే ఎన్నిక‌ల వ్యూహాలు ర‌చిస్తోంది. వచ్చే ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేప‌థ్యంలోనే బీజేపీ ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించింది. ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ నేతలు ఢిల్లీలో క‌మ‌ళం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. పార్టీ భవిష్యత్తు వ్యూహంపై సమావేశంలో చర్చ జరిగింది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ.. గెలుపు కోసం పక్కా ప్లాన్ వేస్తోంది. దీనికి సంబంధించి ఛత్తీస్‌గఢ్ బీజేపీ నేతలు ఆ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు.

ఛత్తీస్‌గఢ్ బీజేపీ నేతలు ఢిల్లీలో సమావేశం..

అసెంబ్లీ ఎన్నికల కోసం ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో రాష్ట్ర బీజేపీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కూడా హాజరయ్యారు. ఇందులో మాజీ సీఎం రమణ్‌సింగ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణుదత్‌తోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. మే 5 నుంచి మే 20 వరకు సవివరమైన కార్యాచరణ ప్రణాళిక అమలుకు సంబంధించి చర్చలు జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

విస్తారక్ ఎన్నికలకు సిద్ధం... ! 

ఛ‌త్తీస్‌గఢ్ బీజేపీ ఎన్నిక‌ల ప్ర‌ణాళిక ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని శక్తి కేంద్రాలకు (Shakti Kendra) విస్తారకులు (పరిశీలకులు) పంపబడతారు. రాష్ట్రంలో 4,500కు పైగా శక్తి కేంద్రాలు ఉన్నాయి. ప్రతి శక్తి కేంద్రం 5-7 బూత్‌లను కలిగి ఉంటుంది. విస్తారకులందరూ ఈ బూత్‌లలో 15 రోజుల్లో ఎన్నికల సన్నాహాలు చేస్తారు.

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూత్ ఫ్రంట్ పోరు.. 

భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) యువమోర్చా విభాగం నేతృత్వంలో నిరసనలకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు క‌మ‌ళం వర్గాలు వెల్లడించాయి. రాబోయే కొద్ది రోజుల్లో నిరుద్యోగ భృతి సహా వివిధ సమస్యలపై రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్య‌తిరేకంగా బీజేపీ నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌ను ప్లాన్ చేస్తున్న‌ట్టు బీజేపీ పేర్కొన్నాయి. బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేయాలని ఈ సమావేశంలో సూచనలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

2018లో కాంగ్రెస్ ప్రభుత్వం..

ఛత్తీస్‌గఢ్‌లోని 2018లో రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. 90 స్థానాలకు గానూ 68 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే బీజేపీ కేవలం 15 స్థానాలకే పరిమితమైంది. అదే సమయంలో జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జోగి)-బహుజన్ సమాజ్ పార్టీ (JCCJ-BSP) కూటమి ఏడు స్థానాలను గెలుచుకుంది. కాగా, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు రాబట్టింది. ముఖ్యంగా యూపీలో వరుసగా రెండో సారి అధికార పీఠం దక్కించుకుని చరిత్రను తిరగరాసింది. మణిపూర్, ఉత్తారాఖండ్, గోవాల్లోనూ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల గెలుపు ఉత్సాహంతో దూసుకుపోతోంది బీజేపీ.