కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో రోజున పాదయాత్రను ప్రారంభించారు. ఇవాళ కన్యాకుమారిలోని అగస్తీశ్వర ఆలయం నుండి పాదయాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించారు.

చెన్నై: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో రోజు కొనసాగుతుంది. నిన్న కన్యాకుమారిలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. గురువారం నాడు కన్యాకుమారిలోని అగస్తీశ్వర ఆలయం నుండి రాహుల్ గాంధీ రెండో రోజున పాదయాత్ర ను ప్రారంభించారు. ప్రతి రోజు రెండు విడతలుగా పాదయాత్రను నిర్వహిస్తారు. ఉదయం ఏడు గంటల నుండి 10:30 గంటల వరకు నిర్వహిస్తారు. రెండో విడత యాత్రను మధ్యాహ్నం 3:30 గంటల నుండి సాయంత్రం 06:30గంటల వరకు పాదయాత్ర చేస్తారు. ప్రతి రోజు సగటున 23. 5 కి.మీ పాదయాత్ర చేసేలా పార్టీ నాయకత్వం రూట్ మ్యాప్ ను సిద్దం చేసింది. 

ఇవాళ ఉదయం రాహుల్ గాంధీ బస చేసిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను రాహుల్ గాంధీ ఆవిష్కరించారు. అనంతరం యాత్రను ప్రారంభించారు. రాహుల్ గాంధీ యాత్ర చేసే ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అబివారం చేస్తూ ముందుకు నడిచారు. కొన్ని చోట్ల తనకు స్వాగతం పలికేందుకు నిలబడి ఉన్న చిన్నారులతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. 

కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర సాగుతుంది. 150 రోజుల పాటు 3,570 కి.మీ పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహిస్తారు. 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల గుండా పాదయాత్ర సాగనుంది. 

also read:కేంద్రం చెప్పుచేతల్లో మీడియా.. అంతా మోడీ భజనే, ఈడీకి భయపడేది లేదు : రాహుల్ విమర్శలు

దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు ఈ యాత్ర దోహదపడే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు యాత్రలు నిర్వహించిన సందర్భాలు లేవు. ఆయా రాష్ట్రాల్లోనే యాత్రలు చేసిన విషయం తెలిసిందే. 2024 ఎన్నికలకు కొన్ని నెలల ముందుగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏ మేరకు పార్టీకి కలిసి వస్తుందోననేది సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.