కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరింది. భారత్ జోడో యాత్ర చివరి రోజైన నేడు రాహుల్ శ్రీనగర్‌లోని పంథాచౌక్ నుంచి తన యాత్రను  ప్రారంభించారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరింది. భారత్ జోడో యాత్ర చివరి రోజైన నేడు రాహుల్ శ్రీనగర్‌లోని పంథాచౌక్ నుంచి తన యాత్రను ప్రారంభించారు. రాహుల్‌తో ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు జాతీయ జెండాలు, పార్టీ జెండాలు పట్టుకుని వారితో పాటు కాలు కదిపారు. ఈ రోజు నగరంలోని సోన్వార్ ప్రాంతం వరకు ఏడు కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. అక్కడ కొద్దిసేపు ఆగిన తర్వాత రాహుల్, ప్రియాంకలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించేందుకు లాల్ చౌక్ సిటీ సెంటర్‌కు చేరుకున్నారు. లాల్ చౌక్ సిటీ సెంటర్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 

రాహుల్ భారత్ జోడో యాత్ర నేపథ్యంలో లాల్ చౌక్ చుట్టుపక్కల ప్రాంతమంతా మూసివేయబడింది. సిటీ సెంటర్ చుట్టూ భారీగా భద్రతా బలగాలను మోహరించారు. లాల్ చౌక్ తరువాత రాహుల్ యాత్ర నగరంలోని బౌలేవార్డ్ ప్రాంతంలోని నెహ్రూ పార్క్ వరకు వెళుతుంది. ఈ రోజు రాహుల్ భారత్ జోడో యాత్ర ముగియనుంది. ఇక, సోమవారం అక్కడి ఎంఏ రోడ్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో గాంధీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఎస్‌కే స్టేడియంలో బహిరంగ ర్యాలీ నిర్వహించబడుతుంది. ఇందుకు 23 ప్రతిపక్ష రాజకీయ పార్టీలను కాంగ్రెస్ ఆహ్వానించింది. 

ఇదిలా ఉంటే.. బీజేపీ పాలన దేశానికి ప్రమాదకరంగా మారిందని ఆరోపిస్తూ.. కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపే విధంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన రాహుల్ యాత్ర దాదాపు 4,080 కి.మీ మేర సాగింది. దేశవ్యాప్తంగా 75 జిల్లాల గుండా రాహుల్ యాత్ర సాగింది.