రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ ప్రమాణస్వీకారం.. హాజరైన ప్రధాని మోడీ..
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ (Bhajan Lal Sharma) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. జైపూర్ లోని ఫేమస్ ఆల్బర్ట్ హాల్ (Albert Hall)లో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ (prime minister narendra modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (union home minister amith shah), బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.
రాజస్థాన్ కొత్త సీఎంగా భజన్ లాల్ శర్మ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఇటీవల జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రులుగా నియమితులైన దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ముగ్గురితో గవర్నర్ కల్ రాజ్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించారు.
జైపూర్ లోలోని ప్రఖ్యాత ఆల్బర్ట్ హాల్ ముందు జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అలాగే గోవా సీఎం ప్రమోద్ సావంత్, త్రిపుర సీఎం మాణిక్ సాహా, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధర రాజే కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముందు భజన్ లాల్ శర్మ జైపూర్ లోని గోవింద్ దేవ్ జీ ఆలయంలో పూజలు చేశారు. టోంక్ రోడ్డులోని పింజ్రాపోల్ గోశాలలో ఆవులకు ఆహారం అందించారు.
ఆ సమయంలో ఆయన వెంట కుటుంబ సభ్యులు, మద్దతుదారులు కూడా ఉన్నారు. తరువాత మరో ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జవహర్ సర్కిల్ సమీపంలోని బాలాజీ టవర్ లోని తన నివాసానికి వెళ్లి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రమాణ స్వీకారానికి బయలుదేరే ముందు శివాలయాన్ని సందర్శించి, పూజలు చేశారు.