Bhagwant Mann: ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌ అరెస్టు పై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. ఈ ఆపరేషన్ సమయంలో శాంతియుతంగా మెలగిన పంజాబ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

Bhagwant Mann: 36 రోజులపాటు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డీ చీఫ్ అమృతపాల్ సింగ్‌ను మోగాలోని రోడ్ గ్రామంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. అమృతపాల్ సింగ్‌పై ఆపరేషన్ గురించి శనివారం రాత్రంతా సీనియర్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భగవంత్ మాన్ చెప్పారు. అమృత్‌పాల్ సింగ్‌ కోసం దాదాపు ఓ నెల నుంచి గాలిస్తున్న సమయంలో శాంతియుతంగా మెలగిన పంజాబ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్'లోని ఒక నివేదిక ప్రకారం.. గురుద్వారా పవిత్రతను కాపాడాలని, బుల్లెట్‌లు కాల్చకుండా ఉండేలా చూడాలని సీఎం మాన్ ఉన్నత పోలీసు అధికారులను కోరారు. బర్గారీ, బెహబల్ కలాన్ లాంటి ఘటనలు జరగకూడదని ఆయన స్పష్టంగా చెప్పారని సీఎం మాన్ తెలిపారు. ఖలీస్తాన్ అంశం చాలా ఏళ్లుగా రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గురుద్వారా ప్రాంగణంలోకి పోలీసులు ప్రవేశించవద్దని, బుల్లెట్లు పేల్చవద్దని ఆదేశించారు.

సీఎం భగవంత్ మాన్ ఈ అంశంపై ప్రత్యేక ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తోంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవ్ యాదవ్‌కు కాల్ చేసి.. నిరంతరం అన్ని అప్‌డేట్‌లను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. గ్రామం మొత్తాన్ని దిగ్బంధించాలని నిర్ణయించినప్పుడు.. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా పోలీసు బలగాలు ఉండేలా చూడాలని సిఎం మాన్ డిజిపిని కోరారని, అయితే భయాందోళనలకు గురికాకుండా చూసుకోవాలని తెలిపారు. అందువల్ల గ్రామంలో సాధారణ దుస్తుల్లో పోలీసులను మోహరించాలని నిర్ణయించారు. ఎందుకంటే యూనిఫాంలో ఇంత భారీ పోలీసు బలగాలు గ్రామస్తులలో భయాందోళనలను వ్యాప్తి చేయవచ్చు .వారిని వ్యతిరేకించవచ్చు.

నెట్‌వర్క్ పూర్తిగా ధ్వంసం 

అమృతపాల్ నెట్‌వర్క్ పూర్తిగా ధ్వంసమైందని, అతని సంస్థకు చెందిన పెద్దలను అరెస్టు చేసి జైలుకు పంపారని పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో అమృతపాల్ నిస్సహాయుడయ్యాడు. గతంలో అతనికి ఆశ్రయం కల్పించిన వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. ఈ చర్య తర్వాత పంజాబ్‌లోని ప్రజలు తమ కార్లలో అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వడం మానేశారు. గతంలో మార్చి 18న జరిగిన ప్రయత్నాల కంటే ఈసారి పోలీసులు భారీ ఎత్తున సన్నద్ధమయ్యారు. గ్రామాన్ని నిర్భంధించే ముందు గ్రామం అంతటా పోలీసు అధికారులను మోహరించారు. దీని తరువాత పోలీసులు అమృతపాల్‌కు గ్రామాన్ని చుట్టుముట్టారని, తప్పించుకునే ఏ ప్రయత్నమైనా విఫలమవుతుందని సందేశం పంపారు. దీంతో అమృతపాల్ లొంగిపోయాడు. వెంటనే అరెస్టు చేశారు.

ఆపరేషన్ సమయంలో..

లొంగిపోయే ముందు, హతమైన ఖలిస్తానీ ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే ఫోటో ముందు అమృతపాల్ వీడియోను రికార్డ్ చేశాడు. అందులో అతను లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. భింద్రన్‌వాలే స్వగ్రామం రోడ్‌లోని గురుద్వారాలో అమృతపాల్ లొంగిపోయాడు. అదే సమయంలో గతేడాది 'వారిస్ పంజాబ్ దే' అధినేత పదవిని చేపట్టారు.

అమృతపాల్ అరెస్టు అయిన కొన్ని గంటల తర్వాత సిఎం మాన్ మాట్లాడుతూ.. ఈ ఆపరేషన్‌కు సంబంధించి తాను శనివారం రాత్రంతా సీనియర్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు. ఆపరేషన్ సమయంలో ఎటువంటి రక్తపాతాన్ని కోరుకోలేదని సీఎం మాన్ చెప్పారు. శనివారం రాత్రి సమాచారం అందుకున్న తర్వాత తాను రాత్రంతా నిద్రపోలేకపోయాననీ, ప్రతి 15 నిమిషాలకు, అరగంటకు సీనియర్‌ ఆఫీసర్‌లను క్రమం తప్పకుండా కాల్ చేస్తూ.. సమాచారం తెలుసుకున్నానని, వారితో నిరంతరం టచ్‌లో ఉన్నానని తెలిపారు. శాంతికి విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తప్పవని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చెప్పారు.