పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పై, ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు చేసిన ఒక రోజు తరువాత కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ దానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. భగవంత్ మాన్ నిజాయితీ పరుడని కొనియాడారు. మాఫియాను అరికట్టడంలో తన పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నిజాయితీపరుడని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. రాష్ట్రంలోని మాఫియాను ఎదుర్కోవటానికి తాను సీఎంకు మద్దతు ఇస్తానని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాజీ నాయకులు కుమార్ విశ్వాస్. అల్కా లాంబాపై పోలీసు చర్యపై పంజాబ్ ప్రభుత్వాన్ని నిందించిన తరువాత ఆయన ఈ విధంగా ప్రశంసలు కురిపించారు. శుక్రవారం ఆయన భగవంత్ మాన్ పై విమర్శలు చేశారు. ఢిల్లీ సీఎం, AAP కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేతులో పంజాబ్ ప్రభుత్వం కీలుబొమ్మలా మారిందని ఆరోపించారు.
కాగా తాజాగా ఆయన కాంగ్రెస్ కు సూచనలు చేస్తూనే, భగవంత్ మాన్ ను కొనియాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే పార్టీ తనను తాను ప్రక్షాళన చేసుకోవాల్సి ఉంటుదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం మాఫియా, నిజాయితీపరుల మధ్య పోరాటాన్ని చూస్తోందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పంజాబ్ సీఎంను ప్రశంసించారు. ‘‘ నేను అతనిని నా తమ్ముడిగా భావిస్తాను. అతడు నిజాయితీపరుడు. నేను అతనిపై ఎప్పుడూ వేలు ఎత్తలేదు. అతను మాఫియాకు వ్యతిరేకంగా పోరాడితే, నా మద్దతు అతనికే ఉంటుంది. నేను పార్టీ శ్రేణులకు మించి ఎదుగుతాను ఎందుకంటే పంజాబ్ ఉనికికి పోరాటం. ’’ అని అన్నారు.
భగవంత్ మాన్ పై విమర్శలు కురిపించిన ఒక రోజు తరువాతే ఈ పరిణామం చోటు చేసుకుంది. నిన్న ఆయన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్కూటర్ నడుపుతున్నట్టుగా దీనిపై భగవంత్ మాన్ కూర్చున్నట్టుగా ఉన్న ఒక కార్టూన్ ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. దీనికి పంజాబ్ ప్రభుత్వం అంటూ క్యాప్షన్ పెట్టారు.
‘‘ పంజాబ్ ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాలో చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తోంది. కుమార్ విశ్వాస్, లంబా అల్కాలపై పోలీసు చర్య ఆయన విమర్శకుల నోరు మెదపడానికి ఉపయోగించబడుతోంది. కాంగ్రెస్ అల్కాకు అండగా నిలుస్తుంది. అతడితో పాటు పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంది. పంజాబ్ పోలీసుల రాజకీయీకరణకు వ్యతిరేకంగా నిరసన చెబుతుంది’’ అని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఆప్ మాజీ నాయకుడు కుమార్ విశ్వాస్, అల్కా లంబాలు ఇటీవల కేజ్రీవాల్ పై వ్యాఖ్యలు చేశారు. దీంతో పంజాబ్ పోలీసులు వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేశారు.ఈ చర్యలు రాజకీయంగా విమర్శలు ఎదుర్కొనేలా చేసింది. కాగా ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కొంత సమయం తరువాత భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడారు. పంజాబ్ లో మైనింగ్, డ్రగ్స్ మాఫియా నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని పంజాబ్ ప్రజలకు హామీ ఇచ్చారు. కాగా పంజాబ్ లో విజయం సాధించిన ఆప్ ను గతంలోనే నవజ్యోత్ సింగ్ సిద్దూ కొనియాడారు. పంజాబ్ లో మార్పు కోసం ఓటు వేసినందుకు ప్రజలను అభినందించారు.
