Bhagavad Gita: గుజరాత్ లోని బీజేపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పాఠశాలల్లో హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత త‌ప్పని స‌రి చేసింది. రాబోయే విద్యాసంవ‌త్స‌రం( 2022-23)నుండి 6 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు భగవద్గీత బోధించ‌నున్న‌ట్టు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జితు వాఘానీ ప్ర‌క‌టించారు. 

Bhagavad Gita: గుజరాత్ ప్రభుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో భగవద్గీత(Bhagavad Gita) తప్పనిసరి చేయబడింది. రాష్ట్ర విద్యా శాఖ తీసుకున్న ఈ నిర్ణ‌యం మేర‌కు గుజ‌రాత్‌లో ఇక‌పై భ‌గ‌వ‌ద్గీత కూడా పాఠ్యాంశంగా మార‌నుంది. ఈ నిర్ణ‌యంతో 6 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు భగవద్గీత బోధించ‌నున్నారు. 

గుజ‌రాత్ విద్యాశాఖ మంత్రి జీతూ వాఘానీ మాట్లాడుతూ.. సిల‌బ‌స్‌లో భ‌గ‌వ‌ద్గీత‌ను ఓ అంశంగా చేర్చ‌నున్న‌ట్లు గురువారం నాడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలోని 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు రాబోయే విద్యా సంవత్సరం నుంచి భగవద్గీత ఓ పాఠ్యంశంగా బోధిస్తామని చెప్పారు. భగవద్గీతను పాఠశాల పాఠ్యాంశాల్లో తప్పనిసరి భాగం చేయడం వెనుక ఉద్దేశం 'భారతీయ సంస్కృతి మరియు విజ్ఞాన వ్యవస్థ'ని పెంపొందించడమనిని తెలిపారు.

రాబోయే విద్యా సంవత్సరం 2022-23 నుండి గుజరాత్ పాఠశాలల్లో అమలు చేయాలని భావిస్తున్నామ‌ని తెలిపారు. 6 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు పుస్తకాల్లో కథ, పారాయణ రూపంలో.. 9 నుంచి 12వ తరగతి వరకు మొదటి భాషా పాఠ్య పుస్తకంలో భగవద్గీతను ప్రవేశపెడతామని ఆయన పేర్కొన్నారు.

అలాగే.. ప్రార్థన కార్యక్రమంలో భగవద్గీత పఠనాన్ని చేర్చాలనీ, భగవద్గీత ఆధారంగా పాఠశాలల్లో శ్లోకన్, శ్లోకపూర్తి, వక్తృత్వ, నిబంధ్, నాట్య, చిత్ర, క్విజ్ వంటి వివిధ పోటీలు, సృజనాత్మక కార్యకలాపాలను నిర్వ‌హించాల‌ని సూచించారు.అలాగే, పిల్లలకు ఆడియో, వీడియో రూపాలతో పాటు ప్రింటెడ్ రూపంలో గీతా శ్లోకాలు ఇస్తామని చెప్పారు. 

 కొత్త స్టడీ మెటీరియల్‌ని దశల వారీగా స్కూల్స్ లో అమలు చేయబడుతుంది. పాఠ్య పుస్తకాలు పునరుద్ధరింబడాల్సి ఉంది. అయితే.. పాఠశాలల్లో పాఠశాల పాఠ్యాంశాల్లో పవిత్ర గ్రంథం భగవద్గీతను ప్రవేశపెట్టడం మొదటిసారే కాదు. దీనికి ముందు.. మధ్యప్రదేశ్‌లో జాతీయ విద్యా విధానం, NEP 2020 ప్రకారం రామాయణం, మహాభారత ఇతిహాసాలు ఇంజనీరింగ్ విద్యా సిలబస్‌లో భాగంగా ప్రవేశ పెట్టారు. 

ప్రస్తుతం గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి. ఇప్పటికే విద్యను కాషాయమయం చేయాలని బీజేపీ భావిస్తోందని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఆరోపిస్తున్నాయి.