సైబర్ నేరగాళ్లు ‘తాజ్ హోటల్‌’ పేరుతో ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసి, దానిలో ‘తాజ్ ఎక్స్‌పీరియన్స్ గిఫ్ట్ కార్డ్’ పేరిట వాలెంటైన్స్ డే ఆఫర్‌ అందిస్తున్నట్లు ప్రకటించారు.

మరికొద్ది రోజుల్లో ప్రేమికుల రోజు వస్తోంది. ఈ రోజు కోసం ప్రేమికులంతా సంవత్సరమంతా ఎదురు చూస్తుంటారు. ఆ రోజు తాము ప్రేమించిన వారితో సరదాగా గడపాలని ఆశపడుతుంటారు. అలాంటి రోజు.. సరదాగా గడిపేందుకు ఓ హోటల్ ఉచితంగా ఆఫర్ ఇస్తే.. అది కూడా తాజ్ హోటల్ అయితే.. ఇదే జరిగింది. అయితే.. ఇదంతా కేటుగాళ్లు చేసిన పని. 

సైబర్ నేరగాళ్లు ‘తాజ్ హోటల్‌’ పేరుతో ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసి, దానిలో ‘తాజ్ ఎక్స్‌పీరియన్స్ గిఫ్ట్ కార్డ్’ పేరిట వాలెంటైన్స్ డే ఆఫర్‌ అందిస్తున్నట్లు ప్రకటించారు. ప్రేమికుల రోజు సందర్భంగా తాజ్ హోటల్‌లో ఉచితంగా బస చేయడానికి కూపన్ అందిస్తున్నట్లు వెబ్‌సైట్‌లో తెలిపారు. 

దీనితోపాటు సంబంధిత లింకును వాట్సాప్ యూజర్లకు పంపించడం ప్రారంభించారు. అయితే ఈ విషయం తాజ్ హోటల్ యాజమాన్యం వరకూ చేరింది. దీనిపై తాజ్ యాజమాన్యం వివరణ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘గుర్తు తెలియని కొందరు వ్యక్తులు తాజ్‌ హోటల్‌లో వాలంటైన్స్ డే ఆఫర్ పేరుతో ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దానితో తాజ్ హోటల్స్ గానీ, హెచ్ఐసీఎల్ గానీ సంబంధం లేదని స్పష్టం చేసింది. తాము ఎటువంటి వాలంటైన్స్ డే ప్రకటనలు ఇవ్వలేదని తెలిపింది. దీనిని ప్రజలు గమనించాలని కోరింది. తాజ్ పేరుతో వచ్చే ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తాజ్ అభ్యర్థించింది.