దేశ ఆర్థిక నేరగాళ్లు నీరవ్ మోదీ - విజయ్ మాల్యాలను భారత్ రప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన పోలీసులు ఫైనల్ గా జైలు గదులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. బ్యాంకులకు టోకరా వేసి విదేశాల్లో నక్కిన వీరికి ప్రత్యేకంగా ఫ్యాన్ లు, టాయిలెట్లు, 24 గంటలు మినరల్ వాటర్,, ఫ్రెంచ్ కిటికీలు.. తెల్లటి గోడలతో గదులను సిద్ధం చేశారు. 

చాలా కాలం తరువాత ఇండియాకు వస్తున్నారు గనక అతిధి మర్యాదలు కొంతైనా ఉండకపోతే ఎలా? అందుకే మోసగాళ్లకు మంచి బెండ్ లు, ఇతర విలాసవంతమైన సౌకర్యాలతో జైలు గదిని రెడీ చేస్తున్నారు. ముందుగా నీరవ్ మోదీ అయితే ఇండియా వచ్చేస్తాడని సీఐడీ ఒక నిర్ణయానికి వచ్చేసింది. 

యూకే లో నక్కిన నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ ని ఇటీవల అక్కడి న్యాయస్థానం కొట్టివేసింది. అతని బెయిల్ పిటిషన్ ను కొట్టివేయడం ఇది నాలుగవసారి. అతను ఇండియాకు రాక తప్పేలా లేదు. అందుకే ముంబై ఆర్థర్‌ రోడ్‌ జైలులో స్పెషల్ గదిని రెడీ చేసి ఉంచారు. ఒకవేళ విజయ్ మాల్యా వచ్చినా కూడా ఇందులోనే ఉంటాడని తెలుస్తోంది. 

ఈ గదిలో స్పెషల్ గా రెండు సిసి కెమెరాలను కూడా అమర్చారు. ఎపుడైనా కోర్టు కాన్ఫిరెన్స్ ద్వారా విచారించవచ్చని కెమెరాలను అమర్చారు. ఇక విజయ్ మాల్యా సంగతేంటో వచ్చే నెల తెలియనుంది. జులై మొదటివారంలో కేసు విచారణ అనంతరం విజయ్ మాల్యా ను కూడా భారత పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.