ఇటీవల కాలంలో విపరీతంగా పాపులారిటీ సంపాదించుకున్న మ్యూజిక్ యాప్ టిక్ టాక్. ఈ యాప్ ద్వారా చాలా మంది యువతీ యువకులు పాపులారిటీ సంపాదించుకున్నారు. ఒకరిని చూసి మరొకరు వీడియోలు తీసి.. వాటిని టిక్ టాక్ లో పోస్టు చేసి క్రేజ్ సంపాదించుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఈ యాప్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కూడా ఉన్నారు. తాజాగా... మరో యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. మెడ విరిగి ఆస్పత్రి పాలయ్యాడు.

కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్ళి తాలూకా గూడకెరె గ్రామానికి చెందిన కుమార్‌ అనే వ్యక్తి పల్టీ కొట్టే సాహసం చేశాడు.ఓ మిత్రుడు ఎదురుగా సపోర్ట్‌గా ఉండగా మరొకరు వీడియో తీస్తున్నారు. ఆర్కెస్ట్రాలలో డ్యాన్సులలో చేసే కుమార్‌ బ్యాక్‌ జంప్‌ చేసేందుకు వెళ్ళి ఫీట్‌ను పూర్తి చేయలేకపోయాడు

 దీంతో మెడ నేలలో కూరుకుపోగా ఒక్కసారిగా కుప్పకూలాడు. మెడ భాగం విరిగిపోగా స్పైనల్‌కార్డ్‌ ఎముకలు విరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు బెంగళూరు ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నాడు. టిక్ టాక్ కోసం వీడియో తీయడానికి ట్రై చేసి ఇలా ఆస్పత్రి పాలయ్యాడని అతని కుటుంబసభ్యులు రోదిస్తున్నారు.