‘‘అందరికీ మంచి నాన్నలు దొరికారు.. మా నాన్న మాత్రం మా కలలను నాశనం చేశాడు. మా చావుకు ఆయనే కారణం’’ అంటూ ఇద్దరు టీనేజీ అమ్మాయిలు, వాళ్ల తల్లి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బెంగళూరుకి చెందిన సిద్దయ్య గ్రూప్ డీ ఉద్యోగి. ఆయనకు భార్య రాజేశ్వరి, పిల్లలు మానస(17), భూమిక(15) ఉన్నారు. కాగా.. సిద్ధయ్య గత కొంత కాలం క్రితం ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్య, ఇద్దరు కూతురులను పట్టించుకోకుండా.. పరాయి స్త్రీ మోజులో పడి తిరుగుతున్నాడు.  ఈ విషయంలో భార్య, భర్తల మధ్య విభేదాలు  చోటుచేసుకున్నాయి.

గత రెండు రోజులుగా సిద్ధయ్య కనీసం ఇంటికి రావడం కూడా మానేసాడు. పూర్తి కుటుంబాన్ని వదిలేసి పరాయి స్త్రీ దగ్గరే ఉండిపోయాడు. దీంతో.. మనస్తాపానికి గురైన రాజేశ్వరి(42), ఆమె కుమార్తెలు మానస, భూమికలు ఇంట్లో సీలింగ్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

చనిపోవడానికి ముందు మానస తన వాట్సాప్ స్టేటస్ లో తమ చావుకి తండ్రే కారణమంటూ పేర్కొంది. అందరికీ మంచి తండ్రులు దొరికారని.. తమకు మాత్రమే తమ కలలను నాశనం చేసే తండ్రి దొరికాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ స్టేటస్ చూసిన రాజేశ్వరి సోదరుడు వెంటనే అక్కడికి వెళ్లి ఇంటి తలుపులు పగలకొట్టి చూశాడు. కాగా... అప్పటికే తల్లీ, కూతుళ్లు ఊరివేసుకొని కనిపించారు.

అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న సిద్ధయ్య కోసం గాలిస్తున్నారు.