బెంగళూరు: ఓ మహిళా టెక్కీ అత్యంత దారుణమైన, అమానవీయమై సంఘటనకు పాల్పడింది. కన్నతల్లిని అత్యంత కిరాతకంగా చంపేసి ప్రియుడితో పారిపోయింది. ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగుళూరులో చోటు చేసుకుంది. తల్లిని చంపిన తర్వాత కొద్ది గంటలకే ప్రియుడితో కలిసి అండమాన్ కు పారిపోయింది. 

పక్కా పథకం ప్రకారం అమృత అనే మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఈ హత్యకు పాల్పడినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. మూడు రోజుల పాటు గాలించిన తర్వాత పోలీసులు అమృతతో పాటు ఆమె ప్రియుడు శ్రీధర్ రావును అండమాన్ లో అరెస్టు చేశారు. 

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... బెంగుళూరుకు చెందిన అమృత (33) 2017 వరకు రెగ్యులర్ గా సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ వచ్చింది. కుటుంబ సమస్యలతో ప్రస్తుతం ఇంటి నుంచే తాత్కాలికంగా పనిచేస్తోంది. అమృత కుటుంబం గత కొన్నేళ్లుగా అప్పులతో సతమవుతూ వస్తోంది.

తండ్రికి ఊపిరితిత్తుల వ్యాధి ఉండడంతో ఆ అప్పులు అయ్యాయి. వాటి నుంచి బయటపడేదుంకు తన తల్లిని, సోదరుడిని హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని అమృత అనుకుంది. ఫిబ్రవరి 2వ తేదీ తెల్లవారు జామున ఐదు గంటల సమయంలో అమృత తన తల్లి నిర్మల (52)ను వంటిట్లో ఉన్న చాకుతో పొడిచింది. ఆ చప్పుడుకు నిద్రలేచి వచ్చిన సోదరుడిని కూడా అదే కత్తితో పొడిచింది.

తల్లి, సోదరుడు మరణించారని భావించి తన బ్యాగుతో బయటకు వెళ్లిపోయింది. అప్పటికే బైక్ పై సిద్ధంగా ఉన్న ప్రియుడి శ్రీధర్ రావుతో కలిసి విమానాశ్రయానికి వెళ్లింది. ఆ బైక్ ను అక్కడే వదిలేసి ముందుగా బుక్ చేసుకున్న విమానంలో పోర్ట్ బ్లెయిర్ కు చేరుకున్నారు. ఐదు రోజుల పాటు అక్కడ గడిపే విధంగా ప్లాన్ చేసుకున్నారు. 

అమృత చేసిన దాడిలో తల్లి అక్కడికక్కడే మరణించగా, సోదరుడు సమీపంలోని తమ బంధువులకు ఫోన్ చేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. కాగా, ముందుగా ప్రియుడికి ఇచ్చిన మాట ప్రకారమే తాను అండమాన్ వెళ్లిపోయానని అమృత పోలీసులకు చెప్పింది. తల్లిని హత్య చేసేందుకు అమృత వేసిన ప్లాన్ గురించి ప్రియుడికి తెలుసా, లేదా అనేది ఇంకా తేలలేదు.