దేశంలో ప్రముఖ ఫుడ్‌ డెలీవరీ సంస్థ జొమాటో మరోసారి వివాదంలో ఇరుక్కుంది. తాజాగా జొమాటో డెలివరీ బాయ్ ఒక మహిళపై దాడికి పాల్పడ్డాడు. చిన్న విషయానికే ఆమెను రక్తమోచ్చేలా దాడిచేశాడు. దీంతో బాధితురాలు తనకు జరిగిన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన కంటెంట్ క్రియేటర్, మేకప్ ఆర్టిస్ట్ హితేషా చంద్రానీ మార్చి 9 న మధ్యాహ్నం జొమాటో యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేశారు. సాయంత్రం 4.30 గంటలకు రావాల్సిన డెలివరీ ఇంతకు ఇంటికీ రాకపోవడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్డర్ ఆలస్యం కావడంపై కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడి, తన ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేయాలని హితేషా కోరింది. అయితే ఇంతలోనే డెలివరీ బాయ్‌ ఆర్డర్‌ తీసుకొని వచ్చాడు. ఈ సందర్భంగా ఆమెతో వాదనకు దిగిన డెలివరీ బాయ్ కామరాజ్ హితేషాతో ఘర్షణకు దిగాడు.

బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో భయాందోళనలకు గురైన హితేషా గట్టిగా కేకలు వేయడంతో కామరాజ్ తన ఆర్డర్‌ను తీసుకొని పారిపోయాడని ఆమె తెలిపారు.

అతని దాడిలో ఆమె ముక్కుకు తీవ్ర గాయమైంది. అనంతరం తన పరిస్ధితికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన హితేషా... జొమాటో సేవలు సురక్షితమేనా అంటూ ప్రశ్నించారు. ఈ వివాదంలో తనకు మద్దతుగా నిలవాలంటూ హితేషా చంద్రాన్నీ కన్నీటి పర్యంతమయ్యారు.