300 సార్లుకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘన.. రూ. 3.20 లక్షల జరిమానా , బండి పట్టికెళ్లమన్న ఓనర్ .. షాకిచ్చిన పోలీసులు
బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి స్కూటీపై ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 320 చలాన్లు పేరుకుపోయాయి. దీంతో రూ.3.20 లక్షల జరిమానా కట్టమని పోలీసులు వెళితే.. బండి తీసుకెళ్లాలంటూ యజమాని చేతులెత్తేశాడు.
డ్రంకెన్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్, ట్రిపుల్ డ్రైవింగ్, లైన్ క్రాసింగ్, వన్ వేలో వెళ్లడం, హెల్మెట్ లేకుండా బండి నడపడం వంటి నిబంధనలను ఉల్లంఘించిన వారికి ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ భారీ జరిమానాలను విధిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని వాహనదారులు చూడకపోవడం, చూసినా పట్టించుకోకపోవడంతో చివరికి అవి తడిసిమోపడవుతున్నాయి. తాజాగా కర్ణాటకలో ఇదే జరిగింది. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి స్కూటీపై ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 320 చలాన్లు పేరుకుపోయాయి. దీంతో రూ.3.20 లక్షల జరిమానా కట్టమని పోలీసులు వెళితే.. బండి తీసుకెళ్లాలంటూ యజమాని చేతులెత్తేశాడు.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని సుధామనగరకు చెందిన వెంకటరామన్‌కు చెందిన హోండా యాక్టివా (కేఏ 05 కేఎఫ్ 7969 )పై పలు సందర్భాల్లో 320 చలాన్లు పడ్డాయి. ఈ మొత్తం చలాన్లకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా కింద ఏకంగా రూ.3.20 లక్షల ఫైన్లు విధించారు. ఇది చూసి వెంకటరామన్ షాక్ అయ్యాడు. ట్రాఫిక్ పోలీసుల కెమెరాకు వందల సార్లు చిక్కడంతోనే ఈ స్థాయిలో చలాన్లు పడినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. జరిమానా చెల్లించాల్సిందిగా బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు వెంకటరామన్‌కు నోటీసులు ఇచ్చారు. అంత పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించడం తన వల్ల కాదని, కావాలంటే తన స్కూటీని తీసుకెళ్లాలని ఆయన చేతులెత్తేశాడు.
అయితే ఆయనకంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివిన పోలీసులు.. తమకు బండి అవసరం లేదు కానీ, జరిమానా కట్టాలని తేల్చిచెప్పారు. రూ.3.20 లక్షల జరిమానా చెల్లించాలని, లేనిపక్షంలో కేసు నమోదు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించడంతో వెంకటరామన్ తలపట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసుల కంటపడితేనే ఈ స్థాయిలో చలానాలు వుంటే.. వారికి తెలియకుండా మనోడు ఇంకెన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డాడోనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.